మెడికల్ షాపు (ఫైల్ ఫోటో)
* 23 షాపుల లైసెన్సులు సస్పెండ్
* మరో 9 షాపులకు హెచ్చరికలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఆన్లైన్ ఫార్మసీలకు అనుబంధంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ (Telangana Medical Shops) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 23 మెడికల్ షాపుల లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు మరో 9 దుకాణాలకు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) డ్రగ్స్ విభాగం ఈ చర్యలు తీసుకుంది. గత అక్టోబర్ 28న ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ సంస్థలకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
మొత్తం 106 దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. టాటా 1ఎంజీ, నెట్‌మెడ్స్, జెప్టో, అపోలో 24/7, మెడ్‌ప్లస్ మార్ట్, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలను పరిశీలించారు.
* నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు..
తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా ఔషధాల అమ్మకాలు జరపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
మందుల కొనుగోలు, అమ్మకాల బిల్లులు సక్రమంగా నిర్వహించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు, షెడ్యూల్ హెచ్1 మందుల రికార్డులు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలు కూడా వెలుగుచూశాయి. నిబంధనలు ఉల్లంఘించిన 23 మెడికల్ షాపులపై అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో 15 షాపులను (Telangana Medical Shops) తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేయాలని ఆదేశించగా, మరో 8 షాపుల లైసెన్సులను నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేశారు. అదనంగా మరో 9 మెడికల్ షాపులకు హెచ్చరికలు జారీ చేశారు.
* ప్రజలకు TG SAFE సూచన..
ఆన్లైన్లో మందులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రిస్క్రిప్షన్ మందులను వైద్యుల చీటీ లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఆన్లైన్ సంస్థలకు అనుబంధంగా పనిచేసే మెడికల్ షాపులు సైతం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.
మందుల అక్రమ విక్రయాలు, ఆన్లైన్ ఫార్మసీలలో నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలనుకునే ప్రజల కోసం 1800-599-6969 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

