నగరం గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ (ఫైల్)
* ONGC బావి నుంచి భారీ లీకేజీ
* నగరం గ్రామంలో గ్యాస్ బ్లోఔట్..
* 200 కుటుంబాల తరలింపు
* గ్యాస్ లీకేజీతో పరుగులు తీసిన ప్రజలు..
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ (ONGC Gas Leak ) ఘటన తీవ్ర కలకలం రేపింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ONGC రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి మంగళవారం తెల్లవారుజామున భారీగా గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గ్యాస్ గ్రామమంతా వ్యాపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ లీకేజీ తీవ్రతను (ONGC Gas Leak ) గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు. గెద్దాడ-మామిడికుదురు హైవే సమీపంలో ఘటన చోటుచేసుకోవడంతో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు.
* సీఎం చంద్రబాబు ఆరా..
గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకురావడానికి ONGC నిపుణులు రంగంలోకి దిగారు. గ్యాస్‌కు మంటలు అంటుకోకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు. నరసాపురం నుంచి ప్రత్యేక బ్లోఔట్ కంట్రోల్ బృందాన్ని కూడా రప్పించారు.
లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు.
* వరుస ఘటనలతో కోనసీమ ప్రజల్లో ఆందోళన..
కోనసీమ జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న గ్యాస్ లీకేజీ ఘటనలు స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఇరుసుమండ ప్రాంతంలో జరిగిన గ్యాస్ బ్లోఔట్ ఘటన ఇంకా ప్రజల మదిలో ఉండగానే నగరం గ్రామంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకోవడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
గ్యాస్ లీకేజీని పూర్తిస్థాయిలో నియంత్రించి తమకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం అధికారులు, ONGC సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తూ గ్యాస్ లీకేజీ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

