ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
* రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక కోరిన కాంగ్రెస్ అధిష్టానం
* సీఎం రేవంత్‌పై విమర్శలు..
* వీడియోలను హైకమాండ్‌కు పంపిన పీసీసీ..!
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇటీవల మునుగోడులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపు విషయంలో తన అసహనాన్ని బహిరంగంగానే వెల్లడించారు.
* అధిష్టానం దృష్టికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం..
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పీసీసీ నాయకత్వం (TPCC) కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పార్టీ హైకమాండ్ (Congress High Command) కోరినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌తో పాటు పార్టీ కేంద్ర నాయకత్వం వద్ద కూడా చర్చనీయాంశంగా మారింది.
* తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కలకలం..
సొంత పార్టీ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రిపై ఓ ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతల మధ్య విభేదాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం పార్టీలో మరింత చర్చకు దారితీసింది.
అధిష్టానం నివేదికను పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది? ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also : హైదరాబాద్‌లో టీజీ సేఫ్ తనిఖీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

