మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
* ప్రభుత్వ పథకాలపై వివరాలు
ఆకేరు న్యూస్, డెస్క్: షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల (SC ST Welfare) సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలను వివరించారు.

* ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం..
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభ స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలోనూ దళితులకు అవకాశం కల్పించినట్లు వివరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలోనూ వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
* యూనివర్సిటీల్లోనూ కీలక పదవులు..
విద్యారంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని సీఎం వెల్లడించారు. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) వైస్ ఛాన్సలర్‌గా దళిత వ్యక్తికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లోనూ ఎస్సీ, ఎస్టీలకు వీసీలుగా అవకాశం కల్పించినట్లు వివరించారు. అర్హత, అవకాశం ఉన్న ప్రతి రంగంలోనూ వారికి తగిన స్థానం కల్పిస్తున్నామని తెలిపారు.

* ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత..
ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ (Indiramma Housing Scheme) ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పేద, అర్హులైన కుటుంబాలకు ఇళ్ల మంజూరులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్), ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయంలో 50 శాతానికి పైగా నిధులను ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
* ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రస్తావన..
దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో గుర్తుచేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటు ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

* ప్రభుత్వ చర్యలను అభినందించిన పార్లమెంటరీ కమిటీ..
ఎస్సీ వర్గీకరణ అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిని అభినందించారు. ఆయా వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరంగా తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, సభ్యులు డాక్టర్ మల్లు రవి, తాపీర్ గావ్, హరీశ్ చంద్ర మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్, దగ్గుమల్ల ప్రసాద రావు పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read : హైదరాబాద్‌లో టీజీ సేఫ్ తనిఖీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

