Chukka Ramaiah
* ఇంటికెళ్లి మరీ శుభాకాంక్షలు!
* విద్యారంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం
* విద్యార్థులకు ఐఐటీ విద్యను చేరువ చేసిన మహనీయుడంటూ ప్రశంసలు
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య (Chukka Ramaiah) శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (A. Revanth Reddy) ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగానికి చుక్కా రామయ్య అందించిన సేవలను సీఎం కొనియాడారు. ఆయన శతజయంతి వేడుకలు తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ చుక్కా రామయ్య క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఐఐటీ (IIT) విద్యను సామాన్య విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప విద్యావేత్తగా ఆయన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. విద్యారంగంలోనే కాకుండా శాసనమండలి సభ్యుడిగా కూడా ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేశారని అన్నారు.
చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని తాను ఎంతో గొప్పగా భావిస్తానని సీఎం తెలిపారు. శాసనమండలిలో సామాజిక, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారని గుర్తుచేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల లేని విషయాన్ని చుక్కా రామయ్య శాసనమండలిలో ప్రస్తావించే వరకు చాలామందికి తెలియదని సీఎం పేర్కొన్నారు. ఆయన ఈ అంశాన్ని సభలో ప్రస్తావించిన అనంతరం ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకుందని వివరించారు.
చుక్కా రామయ్య వంటి వ్యక్తులు కాలానికి, రాజకీయాలకు అతీతులని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు జీవిస్తూ సమాజానికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఆయన ఆలోచనలు, సూచనలు, సలహాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన సేవలను కొనియాడారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

