పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేస్తున్న అతిథులు
* భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలి
* ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్
ఆకేరు న్యూస్, రాయపర్తి : ప్రశ్నించే తత్వంతోనే అసలైన విజ్ఞానం వికసిస్తుందని, విద్యార్థులు బాల్యం నుంచే తార్కిక ఆలోచనా విధానాన్ని అలవర్చుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని మండల విద్యాశాఖాధికారి (MEO) వెన్నంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాయపర్తి (Rayaparthi ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో మండల స్థాయి ‘చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్’ను (Rayaparthi Science Talent Test) ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
* ప్రశ్నపత్రాలను ఆవిష్కరించిన అధికారులు..
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్, డి.సి.ఇ.బి (DCEB) సెక్రటరీ గారె కృష్ణమూర్తి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్ కలిసి చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాలను లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హేతుబద్ధమైన, తార్కిక ఆలోచనలు (Logical Thinking) దేశ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తాయని అన్నారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే కోణంలో విశ్లేషించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
* మూఢ విశ్వాసాలను వీడాలి..
డి.సి.ఇ.బి సెక్రటరీ గారె కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సమాజంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలు, అశాస్త్రీయ భావనలను రూపుమాపాలంటే శాస్త్రీయ దృక్పథం (Scientific Temper)ను అలవర్చుకోవడం ఒక్కటే మార్గమని అన్నారు. ఆదిమానవుడి నుంచి నేటి ఆధునిక మానవుడి వరకు జరిగిన ప్రగతి, వికాసం వెనుక సైన్స్‌దే కీలక పాత్ర అని వివరించారు.
సత్యాన్వేషణకు విజ్ఞానశాస్త్రం ఎంతో దోహదపడుతుందని, విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను రేకెత్తించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
* విద్యార్థుల ప్రతిభకు అభినందనలు..
జెవివి (JVV) మండల కన్వీనర్ గుండు కరుణాకర్ మాట్లాడుతూ.. మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. మానవ మనుగడ, సమాజ శ్రేయస్సు సైన్స్‌తోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. సైన్స్ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేయాలని కోరారు.
అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డి, రమేష్, శంకర్, పున్నమ్మ, విజయ, పవన్, యాకయ్య, అశోక్, భోజ్యా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Also Read : శాస్త్రీయ దృక్పథానికి ‘చెకుముకి’ పోటీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

