Sneha Group IT Raids (File Photo)
* 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
* డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ తనిఖీలు
* తెలుగు రాష్ట్రాల్లో కలకలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ పౌల్ట్రీ, అగ్రిబిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌పై (Sneha Group IT Raids ) ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లోని సంస్థ కార్యాలయాలు, యూనిట్లతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్నేహ గ్రూప్‌కు చెందిన డైరెక్టర్లు రామ్‌రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో ఐటీ బృందాలు (Sneha Group IT Raids) తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సంస్థకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఆర్థిక రికార్డులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
* 1982లో చికెన్ మార్కెట్‌గా ప్రారంభం..
స్నేహ గ్రూప్ వ్యాపార ప్రస్థానం 1982లో ‘రామ్‌రెడ్డి చికెన్ మార్కెట్’గా ప్రారంభమైంది. అనంతరం 1994లో ‘స్నేహ ఫామ్స్’గా విస్తరించింది. కాలక్రమంలో పౌల్ట్రీ బ్రీడింగ్, హ్యాచరీలు, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా తయారీ, సోయా ఉత్పత్తులు, వంట నూనెల తయారీ వంటి రంగాల్లోకి విస్తరించింది. ‘సఫల’ బ్రాండ్ పేరుతో వంట నూనెల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది.
తెలంగాణలో గంటకు సుమారు 12,000 కోళ్లను ప్రాసెస్ చేయగల ఆటోమేటెడ్ ప్లాంట్‌ను సంస్థ నిర్వహిస్తున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పౌల్ట్రీ రంగంతో పాటు పశువుల దాణా, ఫీడ్ తయారీ, ఎడిబుల్ ఆయిల్స్ రంగాల్లోనూ సంస్థకు వ్యాపార విస్తరణ ఉంది.
* సోదాలపై ఆసక్తి..
సంస్థకు చెందిన పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు జరగడంతో వ్యాపార వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. పన్ను చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై అనుమానాలున్నాయంటూ తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన పూర్తి కారణాలను ఐటీ శాఖ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి వివరాలు సేకరించారు..? ఏవైనా పత్రాలు లేదా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Also Read : పిఠాపురంలో అపోలో ఆరంభ్ ప్రారంభం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

