తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్
* ఎన్నికల హామీలను అమలు చేయాలి..
* కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తొలుత జంపన్న వాగు నుంచి సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు ఉద్యమకారులు పాదయాత్ర చేపట్టారు. అనంతరం వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జంపన్న భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చీమ శ్రీనివాస్ మాట్లాడారు.
ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ కోరారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం కేటాయించాలని, ఉచిత రైల్వే, బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ తరహాలో ప్రతి ఉద్యమకారుడికి నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలని సూచించారు.
అలాగే రూ.10 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉద్యమకారుల కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కమిటీల పేరుతో కాలయాపన వద్దు
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని చీమ శ్రీనివాస్ విమర్శించారు. కమిటీల ఏర్పాటు పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి, ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద నాయక్, ఉద్యమకారుల వర్కింగ్ ప్రెసిడెంట్ పత్తి గోపాల్ రెడ్డి, తాడ్వాయి మండల అధ్యక్షుడు నుశెట్టి రమేష్, బండారి చంద్రయ్య, శివరాజు, ఉద్యమకారుల ఫోరం చైర్మన్, ఫౌండర్ నందగిరి రజనీకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

