EO Lakshmi Prasanna
* ఈవో లక్ష్మీ ప్రసన్న
ఆకేరు న్యూస్, పాలకుర్తి : కార్తీక పౌర్ణమి (Karthika Pournami) పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దక్షిణ భారతదేశంలో అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మూడో ప్రముఖ దేవస్థానంగా పేరొందిన ఈ ఆలయంలో (Karthika Pournami) ఉత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
* భారీ ప్రమిదలో అఖండ జ్యోతి ప్రజ్వలన..
తిరువణ్ణామలై అరుణాచలం స్ఫూర్తితో ఆలయ గుట్టపై ప్రత్యేకంగా భారీ అఖండ జ్యోతిని ఏర్పాటు చేశారు. 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తుతో రూపొందించిన ప్రమిదలో ఒక టన్ను నువ్వుల నూనె, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, రెండు క్వింటాళ్ల ముద్ద కర్పూరం వినియోగించనున్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవం, గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.
* ముఖ్య అతిథులుగా స్వామీజీ, ఎమ్మెల్యే..
ఈ ఆధ్యాత్మిక వేడుకలకు ముఖ్య అతిథులుగా మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠాధిపతి శ్రీ స్వామి దుర్గానందపురి మహారాజ్, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరుకానున్నారు. అఖండ జ్యోతి కార్యక్రమానికి అవసరమైన నూనె, వత్తులు, కర్పూరాన్ని భక్తుల విరాళాల ద్వారా సేకరించడం విశేషం.
* భక్తులకు అన్ని సౌకర్యాలు..
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తుతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (Executive Officer) భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ అరుదైన మహా అఖండ జ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదిదంపతుల కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆమె కోరారు.
Also Read : స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ ఐటీ దాడులు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

