ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి
* పోటీలను ప్రారంభించిన కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి..
* 200 మంది బాల, బాలికల హాజరు
ఆకేరు న్యూస్, కమలాపూర్: యువత చదువుతో పాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించి, తమ ప్రతిభతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు పరిధిలోని ఎంజేపీడబ్ల్యూఆర్ఎస్ బాలుర గురుకుల పాఠశాలలో ఈటల మల్లయ్య-వెంకటమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 71వ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (71st Junior Ball Badminton Championship) పోటీలను సోమవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది క్రీడాకారులు తమ ప్రతిభతో దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని తెలిపారు. యువత పట్టుదలతో సాధన చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. వరంగల్‌కు చెందిన దివంగత పిచ్చయ్య తొమ్మిది సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచి, అర్జున అవార్డు అందుకోవడంతో పాటు ‘పిచ్చయ్య బ్యాట్’ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని గుర్తుచేశారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కమలాపూర్ మండల బాల్ బ్యాడ్మింటన్ కమిటీ అధ్యక్షుడు పబ్బు సతీష్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఒక క్రీడాకారుడు ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి ఎదిగితే, తన రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురావడంతో పాటు సమాజానికి కూడా సేవ చేయగలడని ఈటల సమ్మయ్య అన్నారు.
ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు పోటీలు కొనసాగనున్నాయి. క్రీడాకారులకు నిర్వాహకులు భోజనం, వసతి సదుపాయాలను కల్పించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్, ఖేలో ఇండియా నోడల్ అధికారి పవన్, జిల్లా యువజన క్రీడల అధికారి (DYSO) ప్రశాంత్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో గుండె బాబు, కమలాపూర్ సీఐ నవీన్, ఎంజేపీ బాలుర పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్, ఎంజేపీ బాలుర కళాశాల ప్రిన్సిపల్ కవితా రెడ్డి, ఎంజేపీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సౌజన్య, బాల్ బ్యాడ్మింటన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వి.వి. రమణ, ఉపాధ్యక్షుడు దుర్గయ్య, కమలాపూర్ కమిటీ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు బండి కళాధర్, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలు ఈటల సమ్మన్న, ఈటల భద్రన్న, ప్రొఫెసర్ ఎర్రగడ్డ స్వామి, బంగారు రాజయ్య, రిక్కల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

