ఎమ్మెల్యేలతో సందీప్ కుమార్ సమావేశం
* సందీప్‌తో ఇద్దరు ఎమ్మెల్యేల భేటీ
* రాజగోపాల్ రెడ్డి అలక వీడేనా
* ఎమ్మెల్యేల సమస్యలకు పరిష్కారం దొరికేనా?
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తికి పరిష్కారం చూపే దిశగా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డితో తెలంగాణ నూతన ఏఐసీసీ ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్ సమావేశమయ్యారు. ప్రజాభవన్‌లో నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ భేటీ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, ప్రభుత్వ వ్యవహారశైలి, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్‌తో జరిగిన సమావేశంలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల విడుదల, పెండింగ్ బిల్లులు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావించారు.
* ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణాలివే!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ, మిగతా నియోజకవర్గాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన గతంలో వెల్లడించారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సైతం ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ సమస్యలు, ఎమ్మెల్యేలకు దక్కుతున్న ప్రాధాన్యతపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో సందీప్ కుమార్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* పార్టీ వేదికపైనే సమస్యలు చెప్పండి..!
పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా బహిరంగంగా విమర్శలు చేయకుండా, ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై ప్రస్తావించాలని సందీప్ కుమార్ సూచించారు. పార్టీ నేతల మధ్య సమన్వయం, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై పార్టీకి ఇబ్బంది కలిగించే బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమావేశం అనంతరం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
* తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఇన్చార్జికి కీలక సవాళ్లు..
తెలంగాణ (Telangana Congress) ఏఐసీసీ ఇన్చార్జిగా బీఎం సందీప్ కుమార్ నియామకం కావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో పార్టీ వ్యవహారాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. నవంబర్ 14న ఆయనను తెలంగాణ ఇన్చార్జిగా నియమించింది. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నేతల మధ్య సమన్వయం, ఎమ్మెల్యేల అసంతృప్తి, మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సంబంధాలు వంటి అంశాలు అధిష్ఠానానికి సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ నాయకులు, ఎమ్మెల్యేలతో సందీప్ కుమార్ సమావేశమవుతూ పార్టీ పరిస్థితులపై దృష్టి సారిస్తున్నారు.
* తొందరపాటు నిర్ణయాలకు తావులేదు!
రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ముందుగా పార్టీ నేతలందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సందీప్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య విభేదాలకు గల కారణాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మంత్రులతోనూ సందీప్ కుమార్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ప్రాధాన్యత, రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.
* అసంతృప్తికి పరిష్కారం లభించేనా?
డిసెంబర్ 7తో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలకు ముగింపు పలకడం, ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరించడం అధిష్ఠానానికి కీలకంగా మారింది. సందీప్ కుమార్ జోక్యంతో రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల అసంతృప్తి తగ్గుతుందా? ఎమ్మెల్యేలు లేవనెత్తిన నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మెరుగుపడుతుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారింది.
Also Read : పెట్టుబడుల పండుగకు తెలంగాణ రెడీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

