కలెక్టర్ సత్య శారద ఆదేశం
* బాధితులను గుర్తించి రక్షించాలి..
* అధికారులకు కలెక్టర్ సత్య శారద ఆదేశం
ఆకేరు న్యూస్, వరంగల్: వెట్టిచాకిరి (Bonded Labour), మానవ అక్రమ రవాణా (Human Trafficking) నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. వెట్టిచాకిరిలో మగ్గుతున్న బాధితులను గుర్తించి, వారికి తక్షణ రక్షణ కల్పించడంతో పాటు రాజ్యాంగం కల్పించిన హక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎఫ్ఎంఎం (FMM) సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, కార్మిక, సంక్షేమ శాఖల అధికారులకు వెట్టిచాకిరి నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు తమ హక్కులు, చట్టపరమైన రక్షణ, సహాయం పొందేందుకు సంప్రదించాల్సిన వ్యవస్థలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఆధునిక సాంకేతిక యుగంలోనూ వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరాలుగా కొనసాగడం ఆందోళనకరమన్నారు. ఈ నేరాల స్వరూపం, వాటికి పాల్పడే వ్యక్తుల వ్యవహారశైలి, బాధితులను గుర్తించే విధానాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాధితులను గుర్తించాలని ఆదేశించారు.
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వెట్టిచాకిరికి గురిచేసే వ్యక్తులు బాధితులకు తెలిసినవారు, బంధువులు లేదా సన్నిహితులు కూడా అయి ఉండవచ్చని హెచ్చరించారు. బాధితులు తమ పరిస్థితిని తలరాతగా భావించకుండా రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందుతూ గౌరవప్రదమైన స్వతంత్ర జీవనం సాగించేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాల కార్మికులు, మహిళల అక్రమ రవాణాపై నిఘా
సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దార కవిత మాట్లాడుతూ చిన్నారులు, మహిళలు, పెద్దలు సైతం పలు ప్రాంతాల్లో శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకువచ్చి వెట్టిచాకిరి, బాల కార్మికులుగా పనుల్లో నియమిస్తున్న ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఆపరేషన్ స్మైల్ (Operation Smile), ఆపరేషన్ ముస్కాన్ (Operation Muskaan) కార్యక్రమాల ద్వారా వెట్టిచాకిరి, బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకున్న పలువురు చిన్నారులను రక్షించినట్లు వివరించారు. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో యువతులను ప్రలోభపెట్టి అక్రమంగా వ్యభిచారంలోకి నెట్టిన ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు తహసీల్దార్లు, కార్మిక శాఖ అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (Action Plan) రూపొందించి అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, రిసోర్స్ పర్సన్, హైకోర్టు అడ్వకేట్ మేరకమని, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ డివిజన్ హెడ్ డాక్టర్ ఆనంద్, ఎఫ్ఎంఎం ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, ఇక్బాల్ భాష, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ భార్గవ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇన్స్పెక్టర్ సుకూర్, తహసీల్దార్లు, కార్మిక శాఖ అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

