Gare Venkatesh Madiga
* అవినీతి అధికారుల ఆస్తులు జప్తు చేయాలి
* గారె వెంకటేష్ మాదిగ
ఆకేరు న్యూస్, రాయపర్తి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనానికి అడ్డుకట్ట వేయాలంటే అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేసి, వారికి జీవితఖైదు విధించాలని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ డిమాండ్ చేశారు. రాయపర్తిలో నిర్వహించిన సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
78 ఏళ్లయినా మారని పేదల పరిస్థితి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు తమ హక్కులు, ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా దస్త్రాలను పెండింగ్లో పెట్టి, లంచాలు తీసుకున్న తర్వాతే పనులు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల్లో చైతన్యం అవసరమని పేర్కొన్నారు.
విధులకు హాజరుకాకుండానే జీతాలా?
కొన్ని కీలక శాఖల్లో అధికారులు విధులకు సక్రమంగా హాజరుకాకుండానే నెలనెలా జీతాలు పొందుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టిన అధికారులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సీఎం, ఏసీబీకి ఆధారాలు అందజేస్తాం
అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన పలువురు అధికారులకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని గారె వెంకటేష్ మాదిగ తెలిపారు. త్వరలోనే వాటికి సంబంధించిన ఆధారాలను ముఖ్యమంత్రి, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో సమితి మహిళా రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉదయ, మహిళా నాయకురాళ్లు రమ, అనిత, సరోజ, స్వరూప, జయప్రద, పుష్ప, రాణి, మమత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

