Fertility Centers
* ఐదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికారుల పరిశీలన..
* అనుమతులు, రికార్డులపై ఆరా
ఆకేరు న్యూస్, హనుమకొండ: జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న సంతాన సాఫల్య చికిత్స కేంద్రాల (ART Clinics)పై రాష్ట్ర స్థాయి అధికారుల బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. కేంద్రాల నిర్వహణ, ప్రభుత్వ అనుమతులు, రికార్డుల నిర్వహణతో పాటు వైద్య సేవలకు సంబంధించిన నిబంధనల అమలును పరిశీలించింది.
శుక్రవారం (నవంబర్ 27) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ బి. ప్రేమ్ కుమార్, డేటా అనలిస్ట్ సాయి కుమార్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐదు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని సంతాన సాఫల్య చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు.
జిల్లాలోని సద్గురు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఓయసిస్ ఫెర్టిలిటీ), నోవా హెల్త్ కేర్, ఫర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్, ఒరిజిన్ ఏఆర్టీ క్లినిక్, బేబీ లైఫ్ హాస్పిటల్లను అధికారులు సందర్శించారు.
ఈ తనిఖీల్లో భాగంగా సంతాన సాఫల్య చికిత్స కేంద్రాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, రికార్డులు, నిర్వహణ విధానాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రాల నిర్వహణలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు, రికార్డుల నమోదు, వైద్య సేవల నాణ్యతకు సంబంధించి ఆసుపత్రుల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో హనుమకొండ జిల్లా డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) మాధవ రెడ్డి, డీపీవో రుక్మిద్దిన్, డేటా మేనేజర్ ప్రవీణ్, వినోద్, సందీప్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

