యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్
* ఆన్లైన్ రుణ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు
* యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న సేవలు, రుణ సదుపాయాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ సూచించారు. రుణాలు పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ (CIBIL Score) ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నిర్ణీత గడువులోగా చెల్లించడం ద్వారా మంచి క్రెడిట్ స్కోర్ (Credit Score) కొనసాగించవచ్చని తెలిపారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని యూనియన్ బ్యాంక్ శాఖ 11వ వార్షికోత్సవం (Anniversary) సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్లో ఒక్క ఫోన్కాల్తోనే లక్ష రూపాయల రుణం ఇస్తామంటూ వచ్చే ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే రుణాలు, ఇతర ఆర్థిక సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ నవక్రాంత్ మాట్లాడుతూ.. 2015లో ప్రారంభమైన తమ బ్యాంకు శాఖలో ప్రస్తుతం సుమారు 5 వేల మంది ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు పంట రుణాలు, బంగారు రుణాలు, వ్యాపార రుణాలు తదితర రూపాల్లో మొత్తం రూ.115 కోట్ల రుణాలను ఖాతాదారులకు అందించినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో ఇద్దరు ఖాతాదారులకు రూ.10 లక్షల రుణ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఖాతాదారులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ బ్రాంచ్ హెడ్ వై. రమ్య, బ్యాంకు సిబ్బంది శివరాజు, విజయ్, మురళి, నర్సింగం, అప్రైజర్ వేణు, ఖాతాదారులు జిల్లా రాములు, నగరబోయిన యాదగిరి, మాజీ సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

