
* త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం
* విద్యారంగం మీద పట్టున్న సీనియర్ ఐఏఎస్ అధికారి
* ఆంధ్రాలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి మురళి సేవలు
* ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో తెలంగాణలో అమలుకు చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు సిద్ధం అవుతోంది. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డి(Revnathreddy) ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యార్థులు లేరనే సాకుతో మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవాలని ఆదేశించారు. ఆ తర్వాత ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక నిధులను కేటాయించి పాఠశాలల అభివృద్ధికి పూనుకుంది. ఇదే క్రమంలో విద్యాకమిషన్(Education commision) ఏర్పాటు చేసి చైర్మన్ గా కీలక అధికారిని నియమించే యోచనలో ఉంది. మాజీ ఐఏఎస్ IAS అధికారి ఆకునూరి మురళి(Akunuri Murali)ని చైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
విద్యారంగంపై పట్టున్న అధికారి
ఆకునూరి మురళికి విద్యారంగంపై పట్టున్న అధికారిగా పేరుంది. జగన్ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేశారు. ఏపీలో మన ఊరు – మన బడి(Mana ooru- Mana badi) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. జగన్ ప్రభుత్వ(Jagan Government) హయాంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాలల పరిస్థితిని సమూలంగా మార్చేశారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మురళి విశేషంగా కృషి చేశారు. ఏపీ(AP)లోని జగన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా, విద్యారంగానికి సంబంధించి మంచి మార్కులే వచ్చాయి. దాని వెనుక మురళి కృషి ఉంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను విద్యాకమిషన్ చైర్మన్గా నియమించనున్నట్లు తెలిసింది.
అక్కడ సక్సెస్.. మరి ఇక్కడ?
బీఆర్ ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి కలెక్టర్గా ఆకునూరి మురళి పనిచేశారు. విభేదాలు తలెత్తడంతో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అనంతరం అప్పటి ఏపీ ప్రభుత్వం మురళి సేవలను వినియోగించుకుంది. ఆయన్ను సలహాదారుగా నియమించుకున్న అప్పటి సీఎం జగన్ విద్యారంగం బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పాఠశాలల్లో మౌలిక సదుపాయల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మురళీ అమలు చేసిన ఫార్ములా సక్సెస్ కావడంతో తెలంగాణలో అమలుకు చర్యలు రేవంత్ చర్యలు మొదలుపెట్టారు. చైర్మన్ గా ఆయనను నియమిస్తూ త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. కమిషన్ చైర్మన్కు కేబినెట్ (Cabinet)హోదా కూడా ఉండటంతో మున్ముందు ఈ పోస్టుకు ప్రాధాన్యం ఉండనుంది. ఏపీలో సక్సెస్ అయిన మురళీ ఫార్ములా.. తెలంగాణలో ఎంతవరకు ఫలించనుందో వేచి చూడాలి.