* మంత్రాల నెపంతో దాడి
* ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, మెదక్: మంత్రాల నెపంతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో సోమవారం అర్ధ రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్ కు చెందిన రాములు (56), నిజాంపేట్ మండలం బాచుపల్లికి చెందిన బాలమణితో కలిసి రెండు రోజుల క్రితం గొల్లగూడేనికి చెందిన తమ దగ్గరి బంధువు బురుజు కింది గంగవ్వ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గంగవ్వ ఇంటి సమీపంలో ఉండడంతో మంత్రాలు చేస్తున్నారని స్థానికులు గంగవ్వ ఇంట్లో ఉన్న ముగ్గురిని బయటకు తీసుకొచ్చి తీవ్రంగా దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలు గంగవ్వ, బాలమణికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే అల్లాదుర్గం సీఐ రేణుక ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దాడి చేసిన వారిపై కేసులు: డీఎస్పీ ప్రసన్నకుమార్
జోగిపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ మంగళవారం గొల్లగూడెం గ్రామాన్ని పరిశీలించారు. దాడి జరిగిన విషయంపై గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అంతేగానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, వ్యక్తి చావుకు కారణమైన వారి వివరాలను సేకరించి కేసులు నమోదు చేయాలనీ సీఐ రేణుకను ఆదేశించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
