* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్: సెల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే చింతించవద్దని.. తక్షణమే సీ.ఈ.ఐ.ఆర్. పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న సెల్ ఫోన్ల స్వాధీనానికి సంబంధించి సీసీఎస్ పోలీసుల ఆధ్వర్యంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీస్ లు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతులమీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. దొంగతనం కానీ, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ సీసీఎస్ తో పాటు ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 7427 సీ.ఈ.ఐ.ఆర్. పోర్టల్ లో ఫిర్యాదు చేయగా ఇందులో 3998సెల్ ఫోన్లను గుర్తించి అందులో ఇప్పటి వరకు 2846 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ యజమానులకు అందజేశామని వెల్లడించారు. వారాంరోజులుగా సీసీఎస్ పోలీసులు శ్రమించి మరో 102కి పైగా సెల్ ఫోన్ల ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. సెల్ ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సీ.ఈ.ఐ.ఆర్. పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సీ.ఈ.ఐ.ఆర్. పోర్టల్ (https://www.ceir.gov.in) నందు బ్లాక్ చేసి, సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్ స్పెక్టర్ అబ్బయ్య, ఐటీ కోర్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఏఎస్సై గోపాల్ రెడ్డి, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ మాధవరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మేఘనాధ్, నర్సింహులు, రవీంద్రచారితో పాటు ఐటీ కోర్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.