* ఐఏఎస్‌లకు హైకోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : క్యాట్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించలేవని జడ్జి పేర్కొన్నారు. ఐఏఎస్ లు అయినంత మాత్రాన స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని అభిప్రాయపడింది. ముందు వెళ్లి ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వులపై ఇటీవల ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణీ ప్రసాద్, డీ రొనాల్డ్‌రాస్, జీ సృజన, హరికిరణ్, శివశంకర్ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై క్యాట్ సభ్యులు లతా బస్వరాజ్ పట్నే, శాలినీ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన స్థానాల్లో ఈ నెల 16లోగా విధుల్లో చేరాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీంతో క్యాట్ తీర్పును సవాలు చేస్తూ నలుగురు ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. క్యాట్ తీర్పు ప్రకారం ఇవాళే రిపోర్ట్ చేయాల్సి ఉంది. అధికారులను రిలీవ్ చేయడానికి ప్రభుత్వాలు 10 రోజుల నుంచి 15 రోజుల గడువు కోరాయి.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
