* ధరల పెంపుపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ డేస్‌లో రిలీజ్ రోజే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయన్న న్యాయమూర్తి.. ఇప్పట్లో కుటుంబం మొత్తం సినిమా వీక్షించాలంటే 8 వేలు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో ద్వారా వచ్చే నగదు ఎక్కడికి మల్లిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు.
అయితే, పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది.కాగా, పుష్ప-2 సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ. 800 వరకు పెంచింది. డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు రూ. 200, ఆ తర్వాత కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే, ఈ సినిమా టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడిగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడుగా ఉన్నారు. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
…………………………….