* ఎవరెన్ని కుట్రలు పన్నినా అభివృద్ది ఆగదు
* రైజింగ్ ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) అన్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ ( NTR MARG) వద్ద గల హెచ్ఎండీఏ గ్రౌండ్స్ (HMDA GROUNDS) లో హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాల(RISING CELABRATIONS) ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర సుందరీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించి, నగరానికి కావలసిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రైజింగ్ ఉత్సవాలను నిర్వహించారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా మూసీ సుందరీ కరణ పేరుతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది విషయంలో తాము వెనుకడుగు వేయబోమన్నారు. కేంద్ర మంత్రి హోదాలో గల సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కేంద్రంతో మాట్లాడి ఒక్క రూ.10 వేల కోట్లు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట తాము నిర్వాసితులకు అండగా నిలబడుతుంటే, అక్కడికి వెళ్లి నిద్రలు చేయడం మాని కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిన భాద్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా కిషన్ రెడ్డి తీసుకురాలేదని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
పదేళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించిన కేసీఆర్
పదేళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఫామ్ హౌస్‌కి పరిమితమై, తాము చేసే అభివృద్దికి అడ్డు పెట్టడం ఎలా అంటూ ఆలోచిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. పదేళ్లు అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై చర్చించేందుకు తాను సిద్దమని, మీ పాలసీ డాక్యుమెంట్‌ను తెలంగాణ సమాజానికి చూపించండంటూ సీఎం సవాల్ విసిరారు. ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని, అఖిల పక్ష సమావేశం సైతం నిర్వహిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఏమేమి సలహాలు ఇస్తారో ఇవ్వండి అంటూ సీఎం పిలుపునిచ్చారు.
ప్రజలను రెచ్చగొడుతున్న బిఆర్ఎస్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించలేమన్న భయంతో కుట్రపూరితంగా బిఆర్ఎస్ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. హైదరాబాద్ నగరం మీద ప్రేమ, పేదవాళ్లపై అభిమానం ఉంటే సహకరించాల్సింది పోయి కుట్రలు చేయడం మానుకోవాలని బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి రంగులు వేసుకుని పదేళ్లు కాలం వెళ్లదీశారని ఆరోపించారు. పదేళ్లు పాలించి పది పైసలు కూడా నగరం కోసం ఖర్చు చేయని బిఆర్ఎస్ పాలకులకు విమర్శలు చేసే అర్హత లేదన్నారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలను గుప్పిస్తున్న ప్రతిపక్షంపై మండిపడ్డారు. మూసి పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోవడం కాదు. అక్కడే గుడిసె వేసుకుని చిరస్థాయిగా జీవించి చూపించాలన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి మూసి పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోయి తర్వాత నుంచి ప్యాలెస్‌లో ఉండడం సరికాదన్నారు. కాగా ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
…………………………………………….