
* ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక
* సిట్టింగ్ స్థానమైనా పోరాడక తప్పదు
* బీఆర్ ఎస్ శ్రేణులతో తరచూ సమావేశాలు
* మాగంటి సతీమణే అభ్యర్థి?
* మరోవైపు కాచుకుకూర్చున్న కాంగ్రెస్
* నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రులు
* గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారబోతుందా.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమర్థతకు కొలమానంగా నిలవనుంది. అసెంబ్లీ ఫలితాల అనంతరం ఘోర పరాభవాలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు కీలకం కానుంది. అందుకే కేటీఆర్ దీనిపై అంతగా దృష్టి సారించారు. తరచూ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. అయిననూ.. అక్కడ గెలుపు సునాయాసమేనా అంటే.. కాదనే సమాధానమే వస్తోంది.
వచ్చే నెల చివరి వారం లేదా..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉపఎన్నిక ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి ఈ సీటు కీలకం కానుంది. అలాగే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి అనంతరం గులాబీ బాస్ నిశ్శబ్దం పాటిస్తున్నారు. దీంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేసీఆర్ తనయుడే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఈక్రమంలో ఇక్కడ గెలుపు కేటీఆర్ కు ఇజ్జత్ కా సవాలుగా మారిందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ కూడా ఈ నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. తరచూ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
ఆశల పల్లకిలో బీఆర్ ఎస్
ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితికి జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అనుకూల ఫలితాలు వచ్చాయి. మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో రానున్న ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ నేతృత్వంలో వంద స్థానాలు ఖాయమని నేతలు చెప్తూ వస్తున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.
అంత ఈజీ కాదని గుర్తించి..
తాజాగా నిన్న తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వే చేయిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగుందని అంటూనే కొన్నిచోట్ల చాలా వెనుకంజలో ఉన్నామని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తే కానీ పార్టీ గెలుపు అంత ఈజీ కాదని నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని అన్ని సీట్లను గెలిపించి ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలిచారనే విషయాన్ని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుని, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని దేశానికి ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలోనే ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సమష్టిగా మరింత కష్టపడాల్సిన అవసరాన్ని కేటీఆర్ తెలియజేశారు. అలాగే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్లే అన్న సమాచారం కూడా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి సహకారం కూడా కోరినట్లు తెలిసింది.
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు
మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆ లోటును తీర్చుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సాధించిన విక్టరీని ఇక్కడ కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. ఈక్రమంలోనే ఏకంగా నలుగురు మంత్రులతో ఓ కమిటీ వేసి వారితో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. రోజూ ఏదో కార్యక్రమంతో మంత్రులందరూ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు.