cp swetha, Fake Catering Contract Cyber Fraud
* నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో భారీ సైబర్ మోసం
* రూ.36.99 లక్షల మోసాలు..
* 23 కేసులు, 6 సైబర్ ఫిర్యాదుల్లో నిందితుడి ప్రమేయం
* రూ.13.09 లక్షలు హోల్డ్ చేసిన హనుమకొండ పోలీసులు
అకేరు న్యూస్ హనుమకొండ, :
నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఆహార సరఫరా అవకాశాల పేరుతో హాస్టల్ యజమానులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా మోసగాడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధినంటూ పరిచయం చేసుకుని, కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హనుమకొండ పోలీస్ స్టేషన్లో నమోదైన Cr.No.461/2025, U/s 318(4) BNS, Sec.66-D IT Act కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో తెలంగాణలోని పలు జిల్లాల్లో నమోదైన మోసపూరిత కేసులతో పాటు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల్లోనూ అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
* హాస్టల్ యజమానులే టార్గెట్
హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి నిందితుడు బాధితులను ఫోన్ చేసేవాడు. తాను ప్రముఖ కంపెనీలో ఉద్యోగినని లేదా ఆ సంస్థ ప్రతినిధినని చెప్పి, తమ కంపెనీ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసేందుకు క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు.
ఆ తర్వాత అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజు, క్యాటరింగ్ సామగ్రి కొనుగోలు, ఇతర ఖర్చుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసేవాడు. బాధితులు బ్యాంకు ఖాతాలు లేదా UPI ద్వారా డబ్బులు బదిలీ చేసిన అనంతరం నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా మొబైల్ నంబర్ మార్చి వారికి అందుబాటులో లేకుండా పోయేవాడు.
ఇతరుల UPI ఖాతాలతో మోసం
కొన్ని సందర్భాల్లో ఇతరుల UPI ఖాతాలను వినియోగించి, అవి కంపెనీ సిబ్బందికి సంబంధించిన ఖాతాలని తప్పుడు సమాచారం ఇచ్చి బాధితుల నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వసూలు చేసిన డబ్బులో కొంత మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించగా, మరికొంత మొత్తాన్ని ఆన్లైన్ గేమింగ్‌లో కోల్పోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
* 23 కేసులు.. రూ.36.99 లక్షల మోసం
నిందితుడి నేరాలపై దర్యాప్తు విస్తరించడంతో పలు జిల్లాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 10 కేసుల్లో అతని ప్రమేయం గుర్తించగా, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో మరో 7 కేసులు గుర్తించారు.
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రూ.33,33,950 మేర నష్టం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో రూ.12,40,657 మొత్తాన్ని హోల్డ్ చేశారు.
అదేవిధంగా FIRలు నమోదు కాకుండా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదైన మరో 6 ఫిర్యాదుల్లో రూ.3,65,050 నష్టం జరిగినట్లు గుర్తించారు. వాటిలో రూ.68,430 మొత్తాన్ని హోల్డ్ చేశారు.
కేసులు, సైబర్ ఫిర్యాదులు కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.36,99,000 మేర మోసం జరిగినట్లు గుర్తించగా, అందులో రూ.13,09,087 మొత్తాన్ని హోల్డ్ చేయడంలో పోలీసులు సఫలమయ్యారు.
* నిందితుడి వివరాలు
అరెస్టైన నిందితుడిని మహమ్మద్ షబ్బీర్ @ కిరణ్ కుమార్ @ శ్రీకాంత్ రెడ్డి @ నర్సింహారెడ్డి (44)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ రామ్‌రెడ్డి నగర్లో నివసిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* మూడు ఫోన్లు.. సిమ్ కార్డులు స్వాధీనం
నిందితుడి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 2 బ్యాంకు పాస్‌బుక్స్, 1 చెక్‌బుక్, 2 ATM కార్డులు, 1 డైరీ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల దర్యాప్తు
హనుమకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో M. కిరణ్ కుమార్, PC-1229; K. రమణకర్, PC-1413; D. రవి, HG-701; D. కారుణ్య, WPC-3272; MD. సల్మాన్ పాషా తదితరులు కీలకంగా పనిచేశారు.
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఉద్యోగాలు లేదా వ్యాపార అవకాశాల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కంపెనీ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే, ఆ సంస్థ అధికారిక ఫోన్ నంబర్లు లేదా అధికారిక వనరుల ద్వారా వివరాలను స్వతంత్రంగా నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్, అడ్వాన్స్, సామగ్రి కొనుగోలు తదితర పేర్లతో తెలియని వ్యక్తులు సూచించిన బ్యాంకు ఖాతాలు లేదా UPIలకు డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరించారు. OTP, PIN, పాస్వర్డ్, బ్యాంకు వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి, లావాదేవీల వివరాలు, మొబైల్ నంబర్లు, మెసేజ్‌లు, చెల్లింపు రసీదులు వంటి ఆధారాలను భద్రపరచుకోవాలని హనుమకొండ పోలీసులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
