Mandakrishna Madiga MRPS Support
* మందకృష్ణ మాదిగను సన్మానించిన టిఎన్జీవోస్ ఉద్యోగ సంఘం నాయకులు
ఆకేరు న్యూస్, హనుమకొండ: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హనుమకొండ జిల్లా పర్యటన సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. TNGOs హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో నాయకులు మందకృష్ణను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఆయన సుదీర్ఘకాలంగా చేసిన పోరాటాలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కలయికలో TGE JAC (తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను మందకృష్ణ మాదిగకు విలవరించారు. ఈ నెల 27, సెప్టెంబర్ 1 మరియు 10 తేదీలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించ తలపెట్టిన పోరాట కార్యక్రమాల వివరాలను ఆయనకు వివరించి, పూర్తి మద్దతును అందించాలని కోరారు.
దీనిపై స్పందించిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి TGE JAC చేపడుతున్న ఈ పోరాటానికి MRPS తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం జరిగే ప్రతి పోరాటంలోనూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు నాయక్, లక్ష్మీప్రసాద్, హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అశోక్, రాజేష్ కన్నా, భరత్, ప్రణయ్, పృథ్వి, అశోక్, సుధాకర్, రాజీవ్, పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, TNGOs బాధ్యులు మరియు MRPS నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
