* ఎడతెరిపిలేని వానలతో ఇబ్బందులు
* కొన్నిచోట్ల దంచికొడుతూ.. ఆగుతున్న వాన
* నగరమంతటా ముసురు
* జలాశయాలకు పోటెత్తుతున్న వరద
* నీటమునిగిన విజయవాడ జాతీయ రహదారి
* నగరంలోకి రాకపోకలకు ఇబ్బందులు
* రోడ్డుపైకి రాకండి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పోలీసుల సూచనలు
* చెరువులు, కుంటలను పరిశీలించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
* జలదిగ్బంధంలో మోకిలా విల్లా.. కరెంట్ బంద్
* కరెంట్ షాక్‌తో ప్రిన్సిపాల్, చెరువులో కొట్టుకుపోయి చిన్నారి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహానగరంలో జనజీవనం స్తంభించింది. ముసురుతో ముసుగేసింది. హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై ఉన్న చెట్లు, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుపై విరిగిపడ్డాయి. హుస్సేన్‌సాగర్(Hussian Sagar) నిండుకుండలా మారడంతో సమీపంలోని నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేనిరీతిలో సాగర్ 17 తూముల గుండా అలుగు పారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నాలా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. వరద పోటెత్తడంతో అల్లాపూర్(Allapur), కూకట్పల్లి(Kukatpally) ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 40 ఇండ్లు నీటమునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్‌నగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఖరీదైన విల్లా ప్రాంగణాలు కూడా వరదనీటిలో చిక్కుకున్నాయి.
రోడ్లు, కంట్రోల్ రూంలలోనే అధికారులు
భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బంది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ రోడ్లపైనే పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నాలా పరీవాహక ప్రాంతాలపై దృష్టి సారించారు. మరికొందరు కంట్రోల్ రూం(Control Room) నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సచివాలయం(Sachivaalayam)లో జరిగిన సీఎం రేవంత్(Cm Revanth) సమీక్ష, సమావేశంలో పాల్గొన్న జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(Ghmc Commisioner Amrapali).. అనంతరం అధికారులతో మాట్లాడారు. వరద నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు ఇప్పటికే సెలవులు రద్దు చేసిన ఆమె.. అందరూ అలర్ట్ గా ఉండాలన్నారు. జీహెచ్ ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 139 కు వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ తక్షణ పరిష్కరించాలని సూచించారు. “ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాం. ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేశాం. సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారమివ్వాలి. నేడు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Collector Anudeep Durisetti) తెలిపారు. జీటీఎసీ కాలనీలోని స్కాడా కంట్రోల్ నుంచి విద్యుత్ సంబంధిత ఇబ్బందులను జేఎన్ కో సీఎండీ రోనాల్డ్ రోస్ (Ronald rose)పరిశీలిస్తున్నారు.
విరిగిపడ్డ చెట్లు, కూలిన స్తంభాలు..
ఆదివారం అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురియడంతో కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి(Greater Hyderabad Area)లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, సైబర్‌సిటీ సర్కిల్(Cybercirty Circle), హబ్సిగూడ, మేడ్చల్, సరూర్‌నగర్ సరిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కిస్మత్పూర్ ఫీడర్ పరిధిలో ఒక ఫేజ్ సరఫరా నిలిచిపోగా, పునరుద్ధరణకు 3 గంటలకుపైగా సమయం పట్టింది. మియాపూర్(Miyapur) పరిధి ఆల్విన్ కాలనీలో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో భారీ చెట్టు కూలడంతో కరెంటు నిలిచిపోయింది. విద్యుత్, బల్దియా బృందాలు చెట్టు కొమ్మలను తొలగించి, కరెంటు తీగలను సరిచేసి సరఫరాను పునరుద్ధరించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని మోకిలా విల్లాలు (Mokila Villas)జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిన్న రాత్రి నుంచీ కరెంట్ సరఫరా లేదు. సుమారు 215 విల్లాలు వరదనీటిలోనే ఉన్నాయి. రూ. 6 కోట్ల విలువైన ఖరీదైన విల్లాలో ఉంటున్న వారు వరదల కారణంగా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
నిండుకుండలా చెరువులు..
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉండగా, 33 చెరువులు నిండుకుండలా మారి అలుగు పారుతున్నాయి. స్లూయిస్ గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ నాలాల్లోకి వరద నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల దిగువ ప్రాంతంలో ఉన్న వారికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం తలెత్తకుండా జీహెచ్ఎంసీ లేక్ విభాగం(Ghmc Lake Department) అప్రమత్తమైంది. సర్ప్లస్ చెరువుల వద్ద ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, న్యాక్ ఇంజినీర్లు, సూపర్వైజర్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. మరోవైపు హుస్సేన్‌సాగర్(HussianSagar)కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతున్నదని, ప్రస్తుతం 10, 400 క్యూసెక్కుల నీరును కిందకు వదలుతున్నామని అధికారులు తెలిపారు.
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి..
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగిస్తుండగా, కరెంట్ తీగలు తగిలి(Current Shock) ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లిలో చేపల వేటకు వెళ్లిన శేఖర్ చెరువులో పడి ప్రాణాలొదిలాడు. షాద్‌నగర్‌లోని నోబుల్ పార్క్ కాలనీ వర్షం నీటిలో పడి 13 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బీహార్‌కు చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.
అటెన్షన్ ప్లీజ్.. రోడ్డుపైకి రాకండి..
ఆదివారం కావడం.. వాహనాలు అంతగా రోడ్డుపైకి రాకపోవడంతో వర్షం కురుస్తున్నప్పటికీ, నిన్న మహానగరంలో అంతగా ట్రాఫిక్(Traffic) ఇబ్బందులు లేవు. సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా.. హైదరాబాద్ నగరంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు(It Employes) ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) కీలక సూచనలు చేశారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కు అనుమతి ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫీక్ పోలీసులు సూచించారు. హైదరాబాద్ (Hyderabad)లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీలకు లేఖరాశారు. ఐటీ ఉద్యోగులు సోమవారం ఇంటి నుంచే పనిచేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయోల్ డేవిస్ సూచించారు.