పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు
ఆకేరున్యూస్, వరంగల్: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా పనిచేసిన బుజగుండ్ల అనిల్ ఆలియాస్ క్రాంతికిరణ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయాడు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం, ఆర్షనపల్లి గ్రామానికి చెందిన ఆనిల్ అలియాస్ క్రాంతి కిరణ్ (31) తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలో అప్పటి పీపుల్స్‌వార్ గ్రూప్‌లో పనిచేసి మరణించడంతో అనిల్ ను తాతయ్య, నాయనామ్మలే పెంచారు. హైదారాబాద్‌లో ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో మావోయిస్టు అనుబంధ సంస్థయిన డీఎస్ఈయూ విభాగంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇదే సమయంలో అనిల్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కరావు ప్రోత్సహంతో 2021 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన మావోయిస్టు అనిల్ కొద్ది రోజులు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ అలియాస్ అనంద్ల వద్ద వ్యక్తిగత సహయకుడిగా పనిచేశాడు. అనంతరం 2023 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం మడ్ ఏరియా కమిటీ సభ్యుడుగా బాధ్యతలు చేపట్టాడు. ఇదే సమయంలో అనిల్ సెంట్రల్ కమిటీ సభ్యుడు,సెంట్రల్ రీజినల్ బ్యూరోకార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్, అలియాస్ సోను అధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ప్రచారకర్తగా కూడా 2023 నవంబర్ వరకు పనిచేసాడు. చివరగా మావోయిస్టు పార్టీ నాయకత్వం జూలైలో ఆనిల్ను తెలంగాణ రాష్ట్ర కమీటీలో ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇదే సమయంలో జులై 19వ తేదీన బీజాపూర్ జిల్లా పరిధిలోని సిమలదొడ్డి గ్రామ ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో మవోయిస్టు దులా మరణించాడు. దీంతో గత జులై చివరి వారంలో అనిల్ తిరిగి కేంద్ర కమిటీ సభ్యులైన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా వారి ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తూ ఆగ్రనేతల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు, వ్యాసాలు, వీడియోలు, ఇంటర్నెట్ అనుబంధ కార్యకలపాలు నిర్వహించేవాడు.
మావోయిస్టు పార్టీలో రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన అనిల్ కొద్ది రోజులుగా నరాలకు సంబంధించిన వ్యాధితో పాటు మావోయిస్టు పార్టీకి ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత, అలాగే ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు అకర్షితుడై జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపొయాడు. లొంగిన పోయిన మావోయిస్టు సభ్యుడు అనిల్‌పై ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన రివార్డు నాలుగు లక్షల రూపాయల చెక్కును లొంగినపోయిన మవోయిస్టు కు పోలీస్ కమిషనర్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.