Massive Fire Breaks Out at Cold Storage Warehouse in Devarayamjal
* కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో చెలరేగిన మంటలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ వద్ద ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కోల్డ్ రష్ లాజిస్టిక్స్ కోల్డ్ స్టోరేజ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే గోదాం నలువైపులకూ వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ నష్టం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
* రంగంలోకి అగ్నిమాపక, హైడ్రా బృందాలు
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, నిర్వాహకులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేశారు. శామీర్‌పేట పోలీసులతో పాటు హైడ్రా బృందాలు, ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీడిమెట్ల, మేడ్చల్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పించారు. సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రసాయనాలు, ప్లాస్టిక్ ఫోమ్ కాలుతుండటంతో నీటితో పాటు ప్రత్యేక ఫోమ్ బ్లాస్టర్లను ఉపయోగించి మంటలను అదుపు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.
* షార్ట్ సర్క్యూట్ వల్లే
గోదాంలోని ప్రాసెస్ యూనిట్లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు వాడే పాలియురేథేన్ ఫోమ్, థర్మోకోల్ ప్యానెళ్లు, ఇతర శీతలీకరణ రసాయనాలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఎగిసిపడినట్లు తెలుస్తోంది. పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
* అందుకే ప్రమాదాలు పునరావృతం
గోదాముంలో భారీ ప్రాసెస్డ్ ఐస్‌క్రీమ్ నిల్వలు, ప్యాకింగ్ మెటీరియల్స్ అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంటలు రావడం గమనించిన సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భారీగా రూ.కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమలు, గోదాముల్లో నిరంతరం ఎలక్ట్రికల్ ఆడిట్ జరగకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
