ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను దాస్యం వినయ్ భాస్కర్ మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నం ఎలాగో, 40 ఏళ్ల కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల కల అన్నారు. నాడు ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని సైతం కేసీఆర్ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని దాస్యం వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్ స్థాయికి త్వరితగతిన అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.
……………………………..