* ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
* 30మంది మావోయిస్టుల హతం
ఆకేరు న్యూస్, ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరగగా… ఘటనా స్థలంలో భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్ర బలగాలు, చత్తీస్గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది. ఘటనా స్థలం నుంచి సైనికులు ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టుల మృతదేహాలతో శనివారం నారాయణపూర్ ప్రధాన కార్యాలయానికి భద్రతా దళాలు చేరుకుంటారని, అక్కడ గత 8 నెలల్లో 165 మంది నక్సలైట్లు వేర్వేరు ఎన్కౌంటర్లలో హతమయ్యారని పోలీసులు చెప్పారు. నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో నక్సలైట్లు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలను నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం పంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 30 మంది మావోయిస్టులు హతమయ్యారని, వారిసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ధృవీకరించారు. మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం ఉన్న ప్రదేశానికి భద్రతా దళాలు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నప్పుడు, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని దంతెవాడ ఎస్పీ తెలిపారు. ఘటన అనంతరం భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని… నారాయణపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన ఉమ్మడి బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోందని తెలియజేశారు.
భద్రతా దళాలు సురక్షితం..
ఎన్కౌంటర్లో భద్రతా దళాలంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు మావోయిస్టుల తాత్కాలిక శిబిరాన్ని కూల్చివేసి, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.
……………………………………………….