* పోలీసును పట్టుకునేందుకు ఏసీబీ చేజింగ్
* హైదరాబాద్ రోడ్డుపై ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సాధారణంగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు చేజింగ్ చేస్తుంటారు. కానీ.. ఓ పోలీసును పట్టుకునేందుకు పోలీసులే పరుగెట్టిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ అల్వాల్ ఫార్మా వ్యాపారి సీవీఎస్ సత్యప్రసాద్ బోయిన్ పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు (CCS Police) ఫిర్యాదు చేశారు. వ్యాపార విస్తరణకు సలహాలిస్తానని డబ్బు తీసుకుని మోసం చేశారని సత్యప్రసాద్ ..రంగస్వామిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించాలని సీసీఎస్ సీఐ సుధాకర్ ను మణిరంగస్వామి కలిశారు. ఇందుకు తనకు 15 లక్షల రూపాయాలు చెల్లించాలని వీరిద్దిరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే అడ్వాన్స్ గా 5 లక్షలను సీఐ సుధాకర్ కు నిందితుడు ఇచ్చారని అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) అధికారులు తెలిపారు. మరో విడతగా మూడు లక్షలను జూన్ 13న ఇచ్చేందుకు రంగస్వామి అంగీకరించారని ఏసీబీ అధికారులు మీడియాకు వివరించారు. సీసీఎస్ సీఐ సుధాకర్ ను ట్రాప్ చేసేందుకు ఏసీబీ పక్కా స్కెచ్ వేశారు. బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం పార్కింగ్ వద్ద మణిరంగస్వామి వద్ద రూ. 3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. రంగస్వామి వద్ద నుండి తీసుకున్న నగదును సీఐ మూడు లక్షలను తన బ్యాగులో సర్దుకున్నాడు. ఇంతలో ఏసీబీ అధికారులను చూసి డబ్బున్న బ్యాగును వదిలేసి రోడ్డుపై పరుగెత్తారు. ఈ విషయాన్ని గమనించిన ఏసీబీ అధికారులు సీఐ సుధాకర్ (Sudhakar) ను ఛేజ్ చేశారు. సీసీఎస్ కార్యాలయానికి కొంతదూరంలోనే సుధాకర్ ను పట్టుకున్నారు. సుధాకర్ చేతులను ఏసీబీ అధికారులు పరీక్షిస్తే పాజిటివ్ గా వచ్చిందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై సినీ తరహాలో జరిగిన ఛేజింగ్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
————————-