Adilabad IT Tower Jobs
* కేసీఆర్ సంకల్పం నెరవేరేనా?
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్:
తెలంగాణలోని ప్రతి మూలకూ ఐటీ రంగాన్ని విస్తరించి, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కల్పించాలనే బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సంకల్పం మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. రాజధాని హైదరాబాద్ నగరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో నిర్మించిన అధునాతన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రీకృతమైన ఐటీ పరిశ్రమను జిల్లా కేంద్రాలకు తీసుకెళ్లి, ఐటీ రంగాన్ని వికేంద్రీకరించాలనే మూలసూత్రంతో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పాలసీలు నేడు ప్రతీ జిల్లాకూ ఫలితాలను అందిస్తున్నాయి.
* అత్యంత ఆధునిక వసతులతో ఆదిలాబాద్ ఐటీ టవర్
ఈ ఐటీ టవర్‌ను 3 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో, 48,000 చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంతో నేషనల్ హైవే (NH-44) సమీపంలో రూ. 58 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఈ ఐటీ టవర్ ద్వారా రోజుకు మూడు షిఫ్టుల్లో దాదాపు 2,000 మంది స్థానిక గిరిజన, గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించేలా అత్యంత ఆధునిక వర్క్స్టేషన్లు, కాన్ఫరెన్స్ హాళ్లు మరియు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రతిభను సాంకేతిక రంగానికి దగ్గర చేసేలా ప్రణాళికలు రూపొందించడం జరిగింది.
* ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించిన ఐటీ విప్లవం
గతంలో ఐటీ ఉద్యోగం సాధించాలంటే కేవలం హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి మెట్రో నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తెలంగాణలోని ద్వితీయ శ్రేణి (టయర్-2) పట్టణాలను టెక్ హబ్‌లుగా మార్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. అందులో భాగంగానే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట మరియు నల్గొండ నగరాల్లో ఐటీ టవర్లు ప్రారంభమై, అనేకu కంపెనీల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు వారి సొంత జిల్లాల్లోనే ఉపాధి లభిస్తున్నాయి.
* యువతకు కొత్త వెలుగులు
ఆదిలాబాద్ వంటి సరిహద్దు జిల్లాల్లో ఐటీ టవర్‌ను అందుబాటులోకి తేవడం వల్ల స్థానిక యువతకు సొంత ఊరిలోనే ఉద్యోగాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. నిరంతర విద్యుత్, హై-స్పీడ్ ఇంటర్నెట్ మరియు ఆధునిక సదుపాయాలను మరింత బలపరచడం ద్వారా ప్రముఖ ఐటీ కంపెనీలను ఈ ప్రాంతాలకు సులభంగా ఆకర్షించవచ్చు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ విధమైన పారిశ్రామిక ప్రోత్సాహం స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా యువత భవిష్యత్తుకు బలమైన భరోసానిస్తుంది. పాలకులు మరియు అధికారులు సమన్వయంతో ఈ ప్రాజెక్టులను వేగవంతం చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఐటీ విప్లవం విజయవంతంగా విస్తరిస్తుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
