* హైదరాబాద్లో మహాధర్నా
* ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
Adivasi Protest| ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆదివాసీల హక్కుల పరిరక్షణ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం చేయాలనే డిమాండ్లతో హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ‘ఆదివాసీల ఆత్మఘోష’ పేరుతో చేపట్టిన ఈ ఆందోళనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ఆదివాసీలు తరలివచ్చారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే అంశంపై శాస్త్రీయ విచారణ జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివాసీల మనుగడపై ఆందోళన
ఆదివాసీల హక్కులు, ఉనికి ప్రస్తుతం ప్రమాదంలో పడుతున్నాయని ధర్నాలో పాల్గొన్న నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతలో ఆదివాసీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తెలంగాణలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ తెగలు తమ ప్రత్యేక భాషలు, సంస్కృతి, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవిస్తున్నాయని గుర్తుచేశారు.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జేఏసీ నాయకులు జి. వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర తదితరులు మాట్లాడుతూ.. వ్యవస్థాగత నిర్ణయాలు, పెరుగుతున్న దాడుల కారణంగా ఆదివాసీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు.
1976లో ఏరియా రిస్ట్రిక్షన్ నిబంధనల తొలగింపు అనంతరం స్థానికత లేని సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల అసలైన ఆదివాసీలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరిగిందని నాయకులు ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
జీవో 3 పునరుద్ధరించాలి
ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో స్థానిక ఎస్టీలకు ఉపాధ్యాయ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించిన జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం ఆదివాసీ యువతకు తీవ్ర నష్టం కలిగించిందని నాయకులు అన్నారు. ఈ నిర్ణయంతో స్థానిక యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారని, మాతృభాషలో ప్రాథమిక విద్య అందకపోవడం వల్ల విద్యార్థుల డ్రాప్అవుట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్తర్వులు తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రత్యేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలివ్వాలి
ఏజెన్సీ ప్రాంతాల భూములను గిరిజనేతరులు వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేలా 1/70 చట్టాన్ని సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు మద్దతుగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు.
అలాగే, రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఏళ్ల తరబడి పోడు సాగు చేస్తున్న ఆదివాసీలకు సంబంధించిన సుమారు 8 లక్షల ఎకరాల భూములకు ఎలాంటి జాప్యం లేకుండా పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

