Cyber Crime| ఆకేరు న్యూస్, సైబరాబాద్: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ గృహిణిని సైబర్ నేరగాళ్లు రూ.11.40 లక్షలకు పైగా మోసం చేశారు. ఫేస్బుక్లో కనిపించిన ట్రేడింగ్ ప్రకటనకు ఆకర్షితురాలైన బాధితురాలు.. నకిలీ యాప్, వాట్సాప్ గ్రూపుల మాయలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. లాభాల పేరుతో చూపించిన అంకెలు నిజమని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టగా, చివరకు నగదు ఉపసంహరణ సాధ్యం కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫేస్బుక్ ప్రకటనతో పరిచయం
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్సీపురం పరిధిలోని బీహెచ్ఈఎల్ కాకతీయనగర్కు చెందిన 38 ఏళ్ల గృహిణికి 2026 ఆగస్టులో ఫేస్బుక్లో ట్రేడింగ్ ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్ చేయడంతో ‘అంకిత’ అనే పేరుతో ఓ మహిళ ఫోన్ ద్వారా పరిచయమైంది. తక్కువ సమయంలోనే భారీ లాభాలు సంపాదించవచ్చని ఆశ చూపిస్తూ, ‘సామ్కో ప్రైమరీ మార్కెట్’ పేరుతో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ట్రేడింగ్పై అవగాహన లేదని బాధితురాలు చెప్పినా.. తానే నేర్పిస్తానని, నష్టం రాకుండా చూస్తానని నమ్మబలికింది.
వాట్సాప్ గ్రూపుతో వల
అనంతరం ఓ వెబ్సైట్ లింక్ను పంపి, సుమారు 118 మంది సభ్యులున్న ‘పాజిటివ్ అండ్ అప్బీట్ గ్రూప్’ అనే వాట్సాప్ గ్రూపులో బాధితురాలిని చేర్చారు. అందులో కొందరు భారీ లాభాలు వచ్చినట్లు సందేశాలు, స్క్రీన్షాట్లు పోస్ట్ చేస్తూ నమ్మకం కలిగించారు. దీంతో మొదట రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టిన బాధితురాలికి యాప్లో రూ.5 వేల లాభం వచ్చినట్లు కనిపించింది. దీంతో ఆ ప్లాట్ఫామ్ నిజమైనదేనని భావించి మరింత డబ్బు పెట్టింది.
ఐపీఓల పేరుతో వసూళ్లు
ఆ తర్వాత ప్రత్యేకంగా ‘ప్రణవ్ ఐపీఓలు’ కేటాయించామంటూ రూ.7.49 లక్షలు చెల్లించాలని నిర్వాహకులు కోరారు. వారి మాటలు నమ్మిన గృహిణి ఆ మొత్తాన్ని బదిలీ చేసింది. అనంతరం యాప్లో సుమారు రూ.18 లక్షల లాభం వచ్చినట్లు చూపించారు. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని కోరగా, లాభాలు పొందాలంటే 20 శాతం సర్వీస్ ఫీజు చెల్లించాలని చెప్పారు. దీంతో మరో రూ.2.44 లక్షలు కూడా చెల్లించింది.
రూ.12 లక్షలు అడగడంతో అనుమానం
సర్వీస్ ఫీజు చెల్లించినా నగదు ఉపసంహరణ సాధ్యం కాలేదు. పైగా మరో రూ.12 లక్షలు జమ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. విచారించగా తాను ఉపయోగించినది నకిలీ ట్రేడింగ్ యాప్ అని తెలిసింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

