* ఫౌండేషన్ చైర్మన్ గాజర్ల అశోక్
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ నగరం కొత్తవాడలోని లూయిస్ బ్రెయిలీ ఆదర్శ అంధుల పాఠశాలలో గురువారం అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవం పురస్కరించుకొని ఆత్మబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ గాజర్ల అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మనకంటే ఆర్థికంగా వెనుకబడిన, వివిధ పరిమితుల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలతో బతుకుతున్న వారిని ఆదుకోవడం మన మానవతా ధర్మం. అంధులు అనగానే సమాజం చిన్నచూపు చూడటం దురదృష్టకరమైన విషయం. జన్యు సమస్యల కారణంగా వారు ఇలా ఉండొచ్చు, కానీ వారి ప్రతిభను పట్టించుకోకపోవడం తప్పు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనల్లో, శాస్త్రసాంకేతిక రంగాల్లో అంధులు చక్కగా రాణిస్తున్నారు. అటువంటి వారు మనకు స్ఫూర్తిగా నిలవాలి. వారు ఎదగడంలో సహకరించడం మన బాధ్యత’’ అని స్పష్టం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో సక్రియంగా పాల్గొని, విద్యార్థులకు తోడ్పాటు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజం అందరి కోసం సమానంగా ముందుకు సాగాలని, సామాజిక సేవ దృక్పథం ద్వారా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బాలగోని రమేష్, మంతెన సమ్మయ్య, వెలగందుల రవీందర్, బొల్లెపల్లి విశ్వనాథ్, మండల విజేందర్, గాజర్ల ప్రవీణ్ , గాజర్ల నవీన్, జ్ఞానేశ్వరి, చిట్ల చందర్, గిర్నాల శ్రీనివాస్, ఎల్వీ శ్రీకాంత్, జిల్లా కోఆర్డినేటర్ గోవిందు వినయ్ కుమార్, వాలంటీర్లు పద్మ, రజని కుమార్, రాకేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
………………………………..