* విచారణ చేపడుతున్న ప్రభుత్వం
* పరస్పర దాడులకు అవకాశం .
* అప్రమత్తమైన పోలీసులు
ఆకేరున్యూస్, విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఘటనాస్థలంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. జగన్ దాడి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు పేర్కొంటున్న నేపథ్యంలో.. ఎయిర్‌గన్‌తో దాడి కి పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. కేసరపల్లి కేంప్ సైట్ వద్ద డీజీ వివరాలు సేకరిస్తున్నారు. అతిత్వరలోనే దీని వెనుక కారణాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. జగన్ తోపాటు గాయపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇదీ రాయి దాడి అని భావించారు. గాయమైన తీరు, దాడి జరిగిన ప్రదేశంలో వచ్చిన శబ్దం ఆధారంగా ఇదీ ఎయిర్ గన్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్టు వైయస్సార్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేయడం అంటే నిజంగా హతమార్చాలన్న ఉద్దేశమా..? అవమానించాలన్న ఉద్దేశమా..? కేవలం గాయపరచడమే ఉద్దేశమా..? అసలెందుకు ఈ దాడి చేశారు.. అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసామని పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఎన్నికల కమిషన్ అధికారులకు నివేదించారు.
* పరస్పర దాడులకు అవకాశం ..?
ఎన్నికల సమయంలో సీఎం జగన్ పై దాడి జరగడం రాజకీయంగా చాలా ప్రాధాన్యత అంశంగా మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి వర్సెస్ వైయస్ జగన్ పార్టీల మద్య కేవలం మాటల దాడి మాత్రమే జరుగుతోంది. ఇపుడు ఏకంగా రాళ్ళ దాడి ప్రారంభం అయింది. దీంతో రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమంలో ఉధ్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. వైయస్సార్ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు , పవన్ కల్యాణ్ ల పై దాడులకు పాల్పడే అవకాశాలు లేకపోలేదు. వైయస్సార్ పార్టీ నేతలు సంయమనం పాటించాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అయినప్పటికీ ఈ పిలుపును కార్యకర్తలు మరో రూపంలో అర్థం చేసుకునే అవకాశాలు లేకపోలేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల నాయకుల ప్రచార సభల మద్య గతం కంటే మరింత కట్టుదిట్టమైన భద్రతను పెంచుతున్నారు. డేగ కళ్ళతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదు. దీంతో పోలీసులు సమాచార సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు.
—————–
Related Stories
November 21, 2024
November 21, 2024