* వాటికి మనసుంటుందా.?
* సంచలనంగా దక్షిణ కొరియాలో రోబో ‘ఆత్మహత్య’ ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్ : రోబోలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయా..? దక్షిణ కొరియాలో (South Korea) పనిఒత్తిడి తట్టుకోలేక రోబో ఆత్మహత్య (Robot commits suicide) చేసుకుందన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. రోబో సినిమాలో డైరెక్టర్ శంకర్ అన్నట్లుగా.. ఇనుములో హృదయం మొలుచునే.. చందంగా ఆ రోబో హృదయం ఒత్తిడికి గురై చనిపోయిందన్న ఘటనపై తయారీ సంస్థ దర్యాప్తు చేపడుతోంది.
రోబోలకూ కష్టాలు ఉంటాయా?
కష్టాలు మనుషులకే కాదు.. రోబోలకూ ఉంటాయని, తట్టుకోలేకపోతే అవీ విపరీత నిర్ణయాలు తీసుకుంటాయని దక్షిణ కొరియా ఘటనతో తెరపైకి వచ్చింది. గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీసులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక రోబో ఉద్దేశపూర్వకంగానే రెండు మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకింది. ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు. తనను తాను అంతం చేసుకొనే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని.. ఒకేచోట అదేపనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అధిక పనిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతోపాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
ఆ రోబో ఎందుకలా చేసింది..
రోబో సూపర్ వైజర్ గా అందరూ పిలిచే ఆ మర యంత్రం 2023 ఆగస్టు నుంచి సేవలు అందిస్తోంది. ఆదర్శ ఉద్యోగిగా పనిచేస్తూ అందరి ప్రశంసలు పొందుతోంది. సివిల్ సర్వీస్ ఆఫీసర్ పేరిట దానికి ఓ ఐడీ కార్డు కూడా ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు రోజువారీ పత్రాల బట్వాడా, స్థానికులు కోరే సమాచారం వెల్లడి, నగర ప్రమోషన్ వంటి కార్యకలాపాలను రోబో చురుకుగా చేసేదని ఓ అధికారి తెలిపారు. సాధారణ రోబోలు ఒకే అంతస్తులో పనిచేసేలా తయారవగా ఈ రోబో మాత్రం సొంతంగా లిఫ్ట్ ఉపయోగించి వివిధ అంతస్తుల మధ్య సొంతంగా తిరిగేలా తయారైంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికి మరో రోబో సేవలను వినియోగించే ఉద్దేశం లేదని గుమీలోని సిటీ కౌన్సిల్ తెలిపింది. క్యాలిఫోర్నియాకు చెందిన రోబో వెయిటర్ స్టార్టప్ సంస్థ బేర్ రొబోటిక్స్.. ఈ రోబోను తయారు చేసింది. రోబో తనను తాను అంతం చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి చెప్పారు. ముక్కలైన రోబోను సేకరించామని.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తామని వివరించారు.
భావోద్వేగాలను అర్థంచేసుకునే రోబోలు!
‘రోబో’ సినిమాలో లాగా హ్యూమనాయిడ్ రోబోలు మన గ్రహం మీద కొత్త ‘జీవులు’ కాబోతున్నాయా? అంటే నయా సాంకేతిక యుగంలో అవుననే సమాధానం కూడా వస్తోంది. విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో ఇప్పుడు ‘చిట్టి’ లాంటి రోబోలు రాబోతున్నాయట. అవి మనిషి భావోద్వేగాలను సైతం అర్థం చేసుకోగలవు. మనిషిలా భావోద్వేగాలకు గురవుతాయి.. సిరి, అలెక్సాకు చెప్పినట్లుగా కమాండ్స్ ఇస్తే చాలు అర్థం చేసుకుంటాయి. జర్మన్ పార్లమెంట్లో AI నిపుణులు, ప్రొఫెసర్ పాట్రిక్ గ్లానర్ మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకొని మరొక మనిషిలాగా ప్రవర్తించే మరమనిషి టెక్నాలజీ రూపొందుతుందని వివరించారు. ఈక్రమంలో మున్ముందు మరమనుషుల యుగం మొదలవుతుందేమో!
————————–