* హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనాలు
* ఇక్కడి ఆంధ్రాఓటర్లపై గురి
* వస్తాం.. మాకేంటి అంటున్న కొందరు ఓటర్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆంధప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల సంగతి అటుంచితే.. అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం యుద్ధాన్ని తలపిస్తోంది. అధికార, కూటమి పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హద్దులు దాటి విమర్శలు సాగుతున్నాయి. ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో వ్యూహాలను, ఎత్తుగడలను పెంచుతున్నారు. ఈక్రమంలో ఎక్కడెక్కడ తమ ఓటర్లు ఉన్నారో పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతీ ఓటు కీలకం కావడంతో అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వరుసలో తెలంగాణకు కూడా ఏపీ అభ్యర్థులు వచ్చేస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రత్యేక టీమ్‌లు
ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ లో స్థిరపడ్డ ఓటర్లపై గురిపెట్టారు. ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించబోతున్న ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ నియోజకవర్గంలోని ఓటర్లతో హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. విందు భోజనాలు ఏర్పాటు చేస్తూ తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అభ్యర్థుల టీమ్‌లు హైదరాబాద్ లో పని చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల పరిధిలో ఏపీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి మద్దతును కూడగట్టుకోవడానికి అక్కడ ప్రచారాలతో పాటు ఇక్కడ కూడా కాస్త సమయం కేటాయిస్తున్న అభ్యర్దులు, ముఖ్య నేతలు..ఇక్కడి ఓటర్లను కలుస్తున్నారు.
ఆత్మీయ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్‌లోని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు.. తాజాగా మియాపూర్‌లోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీల నేతలు ఆ ప్రాంతంలోని ఓటర్లతో మాట్లాడి.. కూటమికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి కూడా హైదరాబాద్ లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లకు ప్రముఖ హోటల్లో స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు కూడా కూకట్‌పల్లిలోని ఓ గార్డెన్ లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇలా చాలా చోట్ల హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఏపీ ఓటర్లతో కిటకిటలాడడుతున్నాయి. ఓటు వేసేందుకు వస్తాం కానీ.. అంత దూరం పనులు మానుకుని రావాలంటే తమకేంటి అని కొందరు ఓటర్లు బహిరంగంగానే అడుగుతున్నారు. రాను, పోను బస్ చార్జీలను అందిస్తామని, అవసరమైతే వాహనాలు కూడా తామే ఏర్పాటు చేస్తామని అభ్యర్థుల తరఫున హైదరాబాద్ లో పని చేస్తున్న టీమ్స్ చెబుతున్నాయి. రవాణచార్జీలు కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చేందుకు కొందరు సిద్ధం అవుతున్నారు.
————————————