* తొలిసారిగా కొత్త ట్రెండ్
* పోలింగ్ అబ్జర్వలతో సీఈఓ భేటీ
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం పోటెత్తారు. దాదాపు 50 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ క్యూలో నిల్చుని ఉన్నారు. తొలిసారిగా ఏపీలో కొత్త ట్రెండ్ మొదలైందని, ఈనేపథ్యంలో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు పోలింగ్ అబ్జర్వర్లతో ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఈరోజు ఉదయం సమావేశం అయ్యారు. పోలింగ్ శాతంపై చర్చిస్తున్నారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి 80 శాతం దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. వృద్ధులు, మహిళలు, యువత విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున రెండు నుంచి రెండున్నర గంటలపాటు క్యూలైన్లలో నిలుచోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం వేళలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికి దాదాపు 3 వేల 500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూలైన్లలో ఒక్కోచోట కనీసం 100 నుంచి 200 మంది బారులు తీరి ఉండటంతో వారందరికీ ఓటేసే అవకాశమిచ్చారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ కొనసాగింది. తిరువూరు నియోజకవర్గం చింతలకాలనీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొటివాడ అగ్రహారం, విశాఖ జిల్లా పద్మనాభం మండలం, భీమునిపట్నంలోనూ పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
—————————–