* రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న జగన్ పై దాడి కేసు
* డబ్బులివ్వక కొట్టారంటున్న టీడీపీ
* టీడీపీ నేతలే కుట్ర పన్నారంటున్న వైసీపీ
* కీలక మలుపులు తిరుగుతున్న కేసు
* టీడీపీ, వైసీపీ మధ్య పెరుగుతున్ మాటల యుద్ధం
- ఆకేరు న్యూస్, విజయవాడ:
అసలే ఎన్నికలు.. అదే సమయంలో ముఖ్యమంత్రిపై దాడి.. అదీ ప్రచార సమయంలో.. దీంతో ఎన్నికల రణరంగం ఆరోపణలు.. ప్రత్యారోపణలతో హీటెక్కుతోంది. మీరే చేయించారంటే.. కాదు.. మీరే చేసుకున్నారంటూ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరోవైపు రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఏపీలో జగన్‌పై దాడి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. విజయవాడకు చెందిన టీడీపీ నేత బోండా ఉమను ఈకేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. - దుర్గారావును అదుపులోకి తీసుకోవడంతో..
- సీఎం జగన్‌పై దాడి కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన వడ్డెర సంఘం నేత వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కేసు కీలక మలుపు తిరుగుతోంది. దుర్గారావుతో కలిపితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నవారి సంఖ్య ఆరుకి చేరింది. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చూపలేదు. కాగా ఈ కేసులో ఏ1గా సతీష్, ఏ2గా దుర్గారావుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావు ఇటీవలే పార్టీలో చేరినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆటోడ్రైవర్ గా పనిచేసే దుర్గారావు బోండా కార్యాలయ పనులు కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకోవడంతో అతడి ద్వారా బోండా ఉమను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
- డబ్బులు ఇవ్వకే కొట్టారా?
- ఈకేసులో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రచారంలో పాల్గొనేందుకు వడ్డెర బస్తీకి చెందిన కొందరు యువకులను వైసీపీ నేతలను తరలించారు. ఆ సమయంలో వారికి 350 రూపాయలు, మందు, బిర్యానీ ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. మందు బాటిల్ మాత్రమే చేతిలో పెట్టి.. ప్రచారం అనంతరం వైసీపీ నేతలు ముఖం చాటేశారట. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుల మధ్య దీనిపై చర్చ జరిగిందట. వైసీపీ నేతలు డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే జగన్ పై రాయి విసిరనట్లుగా టీడీపీ ప్రచారం చేస్తోంది. కేసు విచారణ విషయాలు బయటకు రాకుండానే, తప్పించుకునేందుకు టీడీపీ నేతలు కట్టు కథనాలు అల్లుతున్నారని వైసీపీ చెబుతోంది.
- బొండా ఉమ పైకి ఎలా మళ్లింది..?
- ఈకేసులో తాజాగా టీడీపీ నేత బొండా ఉమా పేరు తెరపైకి వస్తోంది. ఆయన పార్టీ కార్యాలయ వ్యవహారాలు చూసే వ్యక్తిగా ఉన్న వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచీ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. దుర్గారావును పావుగా ఉపయోగించుకుని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమాను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. టీడీపీ నేతలూ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్గారావును ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని తెలిసింది. సీఎం జగన్ అజిత్‌సింగ్ నగర్లో రోడ్‌షో నిర్వహించినప్పుడు ఆ ప్రాంతంలో దుర్గారావే లేడని, అనవసరంగా కేసులో ఇరుకిస్తున్నారని నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేవలం బొండా ఉమాను కేసులో ఇరికించడానికే దుర్గారావును కావాలని తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈనేపథ్యంలో మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్నది ఉత్కంఠగా మారింది.
- ———————————