* సమయం పెంచాలని ఈసీకి వినతులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే తెలంగాణలో నామినేషన్ల జోరు మొదలైంది. మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అరుణ, మేడ్చల్ కలెక్టరేట్ లో ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మిగతా పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధం అవుతున్నారు. పండితులను సంప్రదించి ముహూర్తాలను ఖరారు నిర్ణయించుకుంటున్నారు. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసి పరిశీలన నిమిత్తం న్యాయకోవిదుల వద్దకు పంపుతున్నారు. ఇదిలా ఉండగా.., తెలంగాణలో ఈసీ ప్రకటించిన పోలింగ్ సమయంపై ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి రాజకీయ పార్టీల నేతలు, ఎన్జీవో ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ టైం ఇచ్చింది ఈసీ. ఓటు వేసేందుకు 5 గంటల వరకే సమయం ఉండటంతో పాటు ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో… పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని పార్టీల నేతలు భావిస్తున్నారు. ఏపీ సహా మిగతా రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ పోలింగ్ టైం పొడిగించాలని కోరుతున్నారు. దీనిపై ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
—————————