* హవాలా తరహాలో నోట్ల టోకెన్లు
* ఒంగోలులో ప్రలోభాల పర్వం
ఆకేరు న్యూస్, విజయవాడ : ఎన్నికల ప్రచారపర్వం చివరి అంకానికి చేరింది. ప్రలోభాల పర్వం మొదలైంది. పోలీసులకు దొరకకుండా వినూత్న తరహాలో తాయిలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. రూ.10 నోటు ( Ten rupees note ) తెస్తే లిక్కర్ బాటిల్ ( Liquor Bottle ), రూ. 50 నోటు తెస్తే బియ్యం బస్తా ( Rice bag ).. ఇస్తున్నారు. ఓటుకు నోటు స్థానంలో.. నోటు తెస్తే.. సరుకులు అందిస్తున్నారు. ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ పరిధిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఈ విధంగా ప్రలోభాల పర్వానికి తెరతీశారు. పోలీసులకు దొరకకుండా కొత్త ఎత్తుగడలకు తెర తీశారు. నగరంలోని డివిజన్లలో మగవారికి భారీగా మద్యం, రెండు ఓట్లకు ఒక బియ్యం బస్తా పంచుతున్నట్లు తెలిసింది. బియ్యంతోపాటు శివారు కాలనీల్లో నూనె ప్యాకెట్లు కూడా ఇస్తున్నారట.
నోటుపై సీరియల్ నంబర్ల ఆధారంగా..
తమ వద్ద ఉన్న రూ.పది, ఇరవై, 50నోట్ల సీరియల్ నంబర్లు రాసి, ఆ నంబర్ల లిస్టును బార్ల యజమానులకు ఇస్తున్నారు. తర్వాత నోట్లను ఓటర్లకు పంచుతున్నారు. పది నోటు తీసుకుని బార్ షాప్‌కు వెళ్తే సీరియల్ నంబర్‌ను తన వద్ద ఉన్న లిస్ట్‌తో సరిపోల్చి.. క్వార్టర్ బాటిళ్ల మద్యం అందజేస్తారు. ఇలా రూ.20కి మూడు, రూ.50కి ఆరు బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే, బియ్యం పంపిణీకి రెండు ఓట్లకు ఒక రూ.50 నోటు ఇవ్వడంతోపాటు, నగరంలోని కొన్ని బియ్యం హోల్‌సేల్ వ్యాపారులతో ఒప్పదం చేసుకుని వారికి నోట్ల జాబితా అందజేశారు. దీంతో ఓటర్లు రూ.50 ఇవ్వగానే వ్యాపారులు ఒక బస్తా బియ్యం అందజేశారు. విషయం తెలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు చేసి రెండు దుకాణాలను సీజ్ చేశారు. పంపిణీ చేస్తుండగా పులి వెంకటరెడ్డి కాలనీలో 554 బస్తాల బియ్యం, లారీని పట్టుకున్నారు.
——————–