* రాహుల్, ప్రియాంక, నడ్డా.. అందరూ ఇక్కడికే
* ప్రచారపర్వంతో హోరెత్తనున్న తెలుగు రాష్ట్రాలు
* పవన్ కోసం పిఠాపురానికి రాంచరణ్, సురేఖ
* జగన్ ముగింపు సభ కూడా పిఠాపురంలోనే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచార ముగియనుంది. అన్ని పార్టీల అగ్రనేతలు ఇక్కడే పర్యటించనున్నారు. వారి రాకతో చివరిరోజు ప్రచారం హోరెత్తనుంది. బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, సభలతో ఎన్నికల సంగ్రామం మోత మోగనుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల స్టార్ క్యాంపెయినర్లు నేడు జిల్లాలో తమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా నేడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీఅనంతపద్మనాభ కాలేజీ మైదానంలో జరుగనున్న బహిరంగసభలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా తాండూరు పట్టణంలో నిర్వహించే ప్రచార సభకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంకాగాంధీ హాజరుకానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వనపర్తిలో నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారు. బీజేపీ తరఫున ప్రచారానికి ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ, పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాజాసింగ్, వెంకటరమణారెడ్డి, నవనీత్కౌర్లాంటి ముఖ్య నాయకులు హాజరుకాగా.. మోదీ పర్యటనతో ప్రచారానికి ముగింపు పలకాలని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే, నాగర్‌కర్నూల్ బీజేపీ అభ్యర్థి పి.భరత్ ప్రసాద్ తరఫున ప్రచారానికి చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేడు కడప జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించి.. మధ్యాహ్నం నిర్వహించే సభలో పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ విదలయ్యాక ఏపీలో రాహుల్ నిర్వహించే తొలి సభ, చివరి సభ కూడా. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమి అభ్యర్థుల తరఫున తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు.
పిఠాపురానికి రాంచరణ్.. నేడు జగన్ సభ
బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం నేడు కాకినాడ జిల్లా పిఠాపురానికి గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి బయలుదేరారు. ఇప్పటికే ఆయర రాజమండ్రికి చేరుకున్నారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పవన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ అక్కడికి వెళ్లనుండడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చరణ్ పవన్‌కు మద్దతు తెలిపారు. ‘మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కల్యాణ్‌ని గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో పూజలు అనంతరం.. చేబ్రోలు లోని పవన్ నివాసానికి చరణ్, సురేఖ చేరుకుంటారు. కాగా, అదే పిఠాపురంలో వైసీపీ అధినేత జగన్ ముగింపు సభ జరగనుండడం ఆసక్తిగా మారింది. ఉప్పాడ సెంటర్ లో మధ్యాహ్నం 3 గంటలకు జగన్ సభకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
————