Minister Seethakka Girls Mock Assembly Telangana
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీ హాల్లోని పూర్వ శాసన మండలి భవనం బుధవారం ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికగా నిలిచింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కిశోర బాలికలు అసెంబ్లీ సమావేశాలను తలపించేలా నిర్వహించిన ‘రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ’ అందరినీ ఆకట్టుకుంది. భవిష్యత్ మహిళా నాయకత్వానికి బలమైన పునాది వేసేలా, రాజకీయాలు మరియు ప్రజాసేవపై బాలికల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
* ప్రజాప్రతినిధుల పాత్రలో ఒదిగిపోయిన బాలికలు…
తెల్లటి ఖాదీ దుస్తులు, కండువాలు ధరించి సరిగ్గా రాజకీయ నాయకులను తలపించేలా బాలికలు సభకు హాజరయ్యారు. అధికార, విపక్ష సభ్యులుగా విడిపోయి.. అత్యంత క్రమశిక్షణతో తమ వాదనలను వినిపించారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం, యువత భవిష్యత్ వంటి కీలక సామాజిక అంశాలపై బాలికలు జరిపిన చర్చలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. టీనేజ్ బాలికల స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మొదట మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించి, అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని ఈ రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశారు.
* ఇది విమర్శల వేదిక కాదు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క బాలికల పరిణితిని చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
“అసెంబ్లీ అనేది ఒకరినొకరు విమర్శించుకునే వేదిక కాదు.. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే చట్టాలు రూపొందించే పవిత్ర స్థలం, ఒక సామాజిక దేవాలయం” అని మంత్రి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీనేజ్ బాలికల కోసం ఇలాంటి వేదికలను కల్పిస్తున్నామని చెప్తూ.. ఈ కార్యక్రమ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
* రీల్స్ చూస్తూ సమయం వృథా చేసుకోవద్దు…
ప్రస్తుతం సోషల్ మీడియా యువతను వేగంగా ఆకర్షిస్తోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రీల్ చూడడం ప్రారంభిస్తే గంటల తరబడి సమయం వృథా అవుతోందని, అలాంటి ఆకర్షణలకు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
రాజకీయాల్లోకి రావాలంటే చదువు అవసరం లేదనే భావన తప్పని, సమాజ సమస్యలను అర్థం చేసుకోవాలంటే మంచి విద్య, నిరంతర అధ్యయనం, విజ్ఞానం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. బాలికలు తమ జీవితంలో క్రమశిక్షణ, సంస్కారం, శ్రమ అనే మూడు విలువలను అలవర్చుకోవాలని, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే సైనికుల్లా ఎదగాలని ఆకాంక్షించారు.
ALSO READ :
* ‘అవకాశాలను అందుకోండి.. గ్లోబల్ విజన్‌తో ఎదగండి’…
మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. మహిళా సంఘాల ద్వారా ప్రతి నెల రూ. 70 వేల వరకు ఆదాయం పొందేలా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, గ్రామీణ మహిళల ఉత్పత్తుల అమ్మకాల కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
“మన మూలాలు గ్రామాల్లో ఉండొచ్చు.. కానీ మన లక్ష్యాలు ప్రపంచాన్ని చేరుకోవాలి (Our roots are local, our vision is global)” అంటూ మంత్రి ఇచ్చిన నినాదం బాలికల్లో ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్తులో ఇదే అసెంబ్లీ హాల్లో వీరంతా నిజమైన ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా, స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా అడుగుపెట్టాలని మంత్రి సీతక్క ఆశీర్వదించారు.

1 thought on “MINISTER SEETHAKKA | లీడర్లుగా మారిన టీనేజ్ బాలికలు”