* రికార్డుస్థాయిలో నమోదు
* నాలుగో దశలో ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ ఇంతలా లేదు
* ఆఖరి కేంద్రంలో అర్దరాత్రి 2 వరకూ పోలింగ్
* ఏపీ తుది పోలింగ్ శాతం వివరాలు వెల్లడించిన ఎంకే మీనా
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో 81.86 శాతం అత్యధిక పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి ఎంకే మీనా అధికారికంగా ప్రకటించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైందన్నారు. నాలుగో దశలో పోలింగ్ జరిగిన ఏ రాష్ట్రంలోనూ ఈస్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదన్నారు. పోలింగ్ రోజున నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయని, రెండు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంకే మీనా తుది పోలింగ్ శాతం వివరాలు వెల్లడించారు. 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిందని, ఆఖరి పోలింగ్ స్టేషన్ లో అర్దరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగడం గమనార్హం అన్నారు. పోలింగ్ శాతం పెంపులో తమ లక్ష్యం నెరవేరిందన్నారు. వర్షం వల్ల కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైనట్లు తెలిపారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 79.77 శాతం నమోదైనట్లు ఎంకే మీనా తెలిపారు.
అత్యధికం.. అత్యల్పం ఎక్కడంటే..
అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 పోలింగ్ శాతం నమోదుకాగా, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా వివరించారు, న్నారు. కుప్పంలో 89.88, ప్రకాశం, చిత్తూరులో 87.09 శాతం పోలింగ్ నమోదైంది. లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా విశాఖలో శాతం 71.11 పోలింగ్ నమోదైంది. అసెంబ్లీకి ఓటేసిన వారిలో కొందరు లోక్సభకు ఓటు వేయలేదని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3,33,40,333 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, పార్లమెంట్ ఎన్నికల్లో 3,33,4,560 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 350 స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు.
——————-