* వైసీపీకి ఎదురు దెబ్బ
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది. ఆ పార్టీకి కంచుకోట రాయలసీమలోనూ అదే పరిస్తితి కనిపిస్తోంది. గత రెండు పర్యాయాలు రాయలసీమ ప్రజలు వైసీపీ వైపే నిలబడ్డారు. గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 49 స్థానాల్లో వైసీపీ(YCP) విజయకేతనం ఎగరవేసింది. ఈసారి కూడా రాయలసీమపై వైసీపీ భారీగానే ఆశలు పెట్టుకుంది. రాయలసీమ ప్రజలు తమవైపే ఉన్నారనే ఆశతో ఉంది. కానీ ఒక్కసారిగా వైసీపికి రివర్స్ అయ్యారు రాయలసీమ ప్రజలు. కోలుకోలేని దెబ్బ కొట్టారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను చూసుకుంటే.. రాయలసీమలో నలభైకి పైగా స్థానాల్లో టీడీపీ(TDP) అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. రాయలసీమలో కనీసం పది స్థానాలను కూడా వైసీపీకి గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 49 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి 52 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రాయలసీమ ప్రజలు మాత్రం వైసీపీని దూరం పెట్టి.. టీడీపీ-బీజేపీ-జనసేన(TDP-BJP-JanaSena) కూటమికి జై కొట్టారు. ఈసారి రాయలసీమలో కచ్చితంగా 40కి పైగా స్థానాల్లో కూటమి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్(YSR) ఫ్యామిలీ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. పదికి పది స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి జగన్(Jagan) సొంత జిల్లాలోనే ఆయనకు ఎదురు దెబ్బ తగులుతోంది. కడపలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు.
——————