వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ అన్లైన్లో దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు సైబర్ నేరగాళ్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పని చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు సొమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి చెక్కు బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్ డ్రైవ్‌లను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తాంబరం పట్టణానికి చెందిన జసిల్ (38), ప్రీతి (32) సైబర్ నిందితులు కొద్ది కాలంగా పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బులు తిరిగి వస్తాయని తప్పుడు ప్రచారంతో గొల్డ్మ్యాన్ సచ్, యాం బ్రాండింగ్స్ అనే తప్పుడు వెబ్సైట్లలో ప్రజలతో భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టించారు. ఇలాంటి పెట్టుబడుల కోసం నిందితులు రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఈ ఖాతాల్లో జమయిన డబ్బును విత్ డ్రా చేసి ఈ సైబర్ జంట జల్సాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసేవారు. ఇదే రీతిలో హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి ఈ సైబర్ నేరగాళ్ల తప్పుడు ప్రచారాన్ని నమ్మి వీరు సూచించిన నకిలీ వెబ్ సైట్లలో సూమారు 28 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టి మోసపోయినట్లుగా గుర్తించాడు. దీంతో బాధితుడు వరంగల్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులను అశ్రయించడంతో పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు సైబర్ క్రైం ఏసీపీ విజయ్‌కుమార్ అధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించి టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించారు. ఆదివారం పోలీసులు ఈ కిలాడీ జంటను చెన్నై లోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి స్థానిక జిల్లాలో కోర్టులో హజరు పర్చారు. అనంతరం సైబర్ విభాగం పోలీసులు నిందితులను సోమవారం ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తీసుకవచ్చారు.
అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విచారించగా నిందితులు వరంగల్ కమిషనరెట్ పరిధిలో రెండు సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించడంతో పాటు, దేశ వ్యాప్తంగా సూమారు 150కి పైగా సైబర్ నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేసి పెట్టుబడుల రూపంలో కోట్ల రూపాయల డబ్బులను వసూళ్లకు పాల్పడ్డామన్నారు. సైబర్ నేరస్తుల జంట తెలంగాణ రాష్ట్రంలో 15 నేరాల్లో మూడు కోట్లకు పైగా డబ్బు వసూళ్లు చేసినట్లు నేరస్తులు అంగీకరించారు. ముఖ్యంగా ఇంత మొత్తంలో మోసానికి పాల్పడిన నిందితులు ఏ ఖాతాలకు డబ్బు మళ్లించారు అనేదానిపై కూడా విచారణ చేపట్టడంతో పాటు ఈ నేరాల్లో ప్రత్యక్ష్యంగాని, పరోక్షంగా కానీ పాల్గొన్న నిందితులను అరెస్టు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అలాగే, నిందితులు వినియోగించిన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలు నిలిపివేశామని పోలీస్ కమిషనర్ వెల్లడిరచారు.
ఈ సందర్భంగా ఈ సైబర్ నేరస్తుల జంటను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్ స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐలు చరణ్‌కుమార్, శివకుమార్, ఏఏవో సల్మాన్‌పాషా, కానిస్టేబుళ్లు రాజు, ఆంజనేయులు, దినేష్, అనూషను పోలీస్ కమిషనర్ అభినందించారు.