* నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందే..
* బుల్డోజర్ న్యాయంపై మార్గదర్శకాలు రూపొందిస్తాం..
* కూల్చివేతల పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
ఆకేరు న్యూస్, డెస్క్: బుల్డోజర్ న్యాయం పేరిట జరుగుతున్న కూల్చివేతలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్లపై వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటీషన్లపై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్(Justice Br Gavaya), జస్టిస్ కేవీ విశ్వనాథన్(Justice Kv Viswanathan) పలు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కూల్చివేతలు జరుగుతున్నట్లు తెలుస్తోందని, దీనిపై ఆయా రాష్ట్రాలతో చర్చించి నిబంధనలు రూపొందిస్తామని పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులైన మాత్రాన ఇళ్లు కూల్చే అధికారం లేదని, ఒకవేళ దోషిగా నిర్దారణ అయినప్పటికీ అటువంటి చర్యలకు పాల్పడకూదదని ఆదేశించింది. అలాగే.. అక్రమ నిర్మాణాలను తాము ప్రోత్సహించేది లేదని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం(Uttar pradesh) తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. నిందితులు కావడం వల్ల ఇళ్లను కూల్చడం లేదని, అంతకు ముందే ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన వారి ఇళ్లను.. అదికూడా స్థానిక సంస్థలు లేదా స్థానిక అభివృద్ది సంస్థల నిబంధనల ప్రకారమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్పందించిన ధర్మాసనం.. ఈ అంశంపై దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపింది.