* ట్రాన్స్జెండర్ల బెదిరింపు వసూళ్ళు
* హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆగ్రహం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల బెదిరింపు వసూళ్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇకపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అవకాశాలను వాడుకుని ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ‘ప్రైడ్ ప్లేస్’ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ల ఆగడాలకు సంబంధించిన వార్తలు నిత్యం వెలుగుచూస్తున్నాయని.. వేడుక జరిగితే చాలు.. అది చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా.. గుంపులుగా అక్కడకు చేరి బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో కొందరు నెటిజనులు ఈ సమస్యను సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా సజ్జనార్ ట్రాన్స్జెండర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట వారు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వీసీ సజ్జనార్ హెచ్చరించారు. తాజాగా అమీర్‌పేటలోని సెస్ ఆడిటోరియంలో సుమారు 250 మంది ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. సీపీ సజ్జనార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే ట్రాన్స్జెండర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.. వాటిని వినియోగించుకుని.. గౌరవప్రదంగా జీవనం సాగించాలని సూచించారు. తమ చేష్టలతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. సీఐడీ, మహిళా భద్రతా విభాగ అడిషనల్ ఏడీజీ చారు సిన్హా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు. అనంతరం ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికి గాను మహిళా భద్రతా విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, వారిని ఎవరైనా వేధింపులకు గురిచేసినా.. వెంటనే ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని చారు సిన్హా తెలిపారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.
…………………………………..

