
అయోధ్య బాలరాముడి నుదుటిన సూర్య తిలకం..
బాలరాముడి నుదుటిన సూర్య తిలకం..
ఆకేరు న్యూస్, ఆయోధ్య:
అయోధ్యానగరిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిన సూర్య తిలకం ( Surya thilak )తేజోమయంగా వెలుగొందింది. 58 మిల్లీమీటర్ల పొడవున సూర్యకిరణం.. రాముడి నుదుటిన తిలకంగా అద్దినట్లుగా ప్రసరించడం ఆసక్తిని గొలిపొందింది. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు జై శ్రీరామ్.. అంటూ జయజయధ్వానాలతో పులకించారు. ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు మా జన్మధ్యమైందంటూ.. మురిసిపోయారు. గుడిలోని ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
ఎలా సాధ్యమైందంటే..?
ఏటా శ్రీరామ నవమి రోజున శ్రీరామ్ లల్లా నుదుటిన సూర్యకిరణాలు పడేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించేలా ప్రత్యేక బీమ్ రూపొందించారు. ఈ మేరకు గర్భుగుడిపైన దక్షిణం వైపు నుంచి ఐఆర్ ఫిల్టర్ ద్వారా.. లోపల ఉన్న 4 అద్దాలపై సూర్యకిరణాలు పడి అవి రిప్లెక్ట్ ద్వారా పరివర్తనం చెంది అయోధ్య రాముడి నుదుటిని తాకేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించారు. ప్రతి సంవత్సరమూ కేవలం శ్రీరామ నవమిరోజున మాత్రమే ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట అనంతరం.. తొలిసారి జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో.. ఈ దృశ్యాన్ని మొదటిసారి చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. అయోధ్య అంతా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది.
—————————–