* కాంగ్రెస్-బీఆర్ ఎస్ కుమ్మక్కై కేసును నీరు గార్చాయి
* నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ట్యాపింగ్
* రాధాకిషన్‌రావు స్టేట్ మెంట్ ఆధారంగా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు
* రేవంత్, హరీశ్‌రావు కూడా బాధితులే
* ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత అభ్యర్థి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ కుమ్మక్కై కేసును నీరుగార్చాయని ఆరోపించారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కేసులో అరెస్టయిన అధికారులు చెప్పారని, అయినా ఎవరినీ ఎందుకు అరెస్టె చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అరెస్ట్ కాకుండా కరీంనగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి వారికి సహకరిస్తున్నాడని ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై చర్యలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కకు పోయిందన్నారు. కేసీఆర్ పాలన మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందని తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు. తననో పాటు, కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని, రేవంత్, హరీశ్‌లు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే అని బండి వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణ కోరాలన్నారు.
——————————–